సూట్ విషయంలో భార్యతో గొడవ.. రూ.500 నోట్లకు నిప్పు పెట్టిన భర్త..!
భార్యతో గొడవ పడిన ఓ వ్యక్తి ఏకంగా రూ.500 నోట్లకు నిప్పు పెట్టాడు. భార్యాభర్తల మధ్య జరిగిన ఓ చిన్న వివాదం చినికి చినికి గాలి వానగా మారడంతో ఈ ఘటన జరిగింది. రాజస్థాన్ లోని జైపూర్ లో వెలుగు చూసిన ఈ విచిత్రమైన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే క్షిణికావేశంలో ఆ వ్యక్తి సొంతింటి నిర్మాణం కోసం దాచుకున్న డబ్బును ఇలా కాల్చివేసి బూడిద పాలు చేయడం షాకింగ్ అనే చెప్పాలి.

జైపూర్ కు చెందిన మంజీత్ ధాకడ్ అనే వ్యక్తి కోసం అతని భార్య ఇటీవల రూ.22 వేలు ఖర్చు చేసి మరీ ఒక ఖరీదైన సూట్ ను కొనుగోలు చేసింది. అయితే సూట్ కోసం రూ.22 వేలు ఖర్చుచేయాల్సిన అవసరం ఏంటని భర్త నిలదీశాడు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. సొంత ఇల్లు కొనుగోలు చేసేందుకు తాను రూపాయి రూపాయి కూడబెడుతుంటే.. నువ్వు ఇలా డబ్బును వృథా చేస్తావా..? అంటూ ఆమెపై మండిపడ్డాడు భర్త. ఇరువురి మధ్య వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలో భార్య తీవ్ర మనస్తాపానికి గురై పుట్టింటికి వెళ్లిపోయింది.
అయితే భర్త మంజీత్ ధాకడ్ తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. తమ ఇద్దరి మధ్య కారణానికి డబ్బు అని భావించి ఆ డబ్బునే తగలెట్టేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదును మొత్తం విత్ డ్రా చేసి.. రూ.500 నోట్ల కట్టలకు నిప్పు పెట్టాడు. నోట్లు కాలిపోతున్న దృశ్యాలను వీడియో తీయగా.. అది కాస్తా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
