దీపకాంతులతో వెలిగిపోయిన విశాఖపట్నం
కార్తీకమాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా దీపోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. తిరుమల, శ్రీశైలం, దుర్గ గుడి, కపిలతీర్థం, శ్రీకాళహస్తీశ్వరాలయం.. ఇలా అనేక ఆలయాల్లో భక్తులు దీప పండుగను జరుపుకొంటోన్నారు. భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగిస్తోన్నారు. సామూహిక దీపోత్సవాల్లో పాల్గొంటోన్నారు. తాజాగా టీటీడీ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఎంజీఎం పార్క్ బీచ్ రోడ్డులో శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
సకల ఐశ్వర్య ప్రదాయిని శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి కృపాకటాక్షాలు సకల జనులపై ప్రసరించాలనే సంకల్పంతో దీన్ని నిర్వహించింది టీటీడీ. వందలాది మహిళా భక్తులు, పెద్ద సంఖ్యలో భక్తజనం ఒకే చోట చేరి భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించారు. అమ్మవారికి సామూహిక దీపారాధన చేశారు. వేలాది దీపాల కాంతులు, వేదమంత్రాల ప్రతిధ్వనులు, అన్నమయ్య సంకీర్తనల మాధుర్యంతో సాగర తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. దీపం జ్ఞానానికి, పవిత్రతకు, శుభానికి ప్రతీక. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని దీపాలతో ఆరాధిస్తే ప్రతి ఇంటా సుఖశాంతులు, సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం. కుటుంబ క్షేమం, సంతాన శ్రేయస్సు, సౌభాగ్యం కోసం మహిళలు అపార భక్తితో దీపపూజలో పాల్గొన్నారు.
అర్చకులు ముందుగా శ్రీ మహాలక్ష్మీ దీపపూజ ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు. అనంతరం శ్రీ చతుర్భుజ మహాలక్ష్మీ అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, దీపలక్ష్మి ఆరాధన, దీపలక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం, కుంకుమార్చన వంటి పూజాదికాలు వేదమంత్రోచ్ఛారణల మధ్య సాగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి సామూహికంగా లక్ష్మీ నీరాజనం సమర్పించారు. చివరిగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు.
అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన సంకీర్తనలు భక్తులను పరవశింపజేశాయి. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి కుటుంబంలో సిరిసంపదలు, ఆరోగ్యం, ఆనందం, సుఖశాంతులు వెల్లివిరియాలని భక్తులు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌డీపీపీ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్, సీపీఆర్ఓ డాక్టర్ టీ రవి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
మరోవంక.. తిరుమలలోని శ్రీవారి ఆలయ బూందీ పోటులో శుక్రవారం ఆయుధపూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ సాధికారిక మండలి చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర, సీవీఎస్వో మురళీకృష్ణ హాజరయ్యారు. శ్రీవారి చిత్ర పటానికి, ప్రసాదాల తయారీకి వినియోగించే యంత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.














Click it and Unblock the Notifications
