"ఇల్లు తాకట్టు పెట్టి వడ్డీలు కట్టుకుంటూ సినిమా తీసా"
'మహావతార్ నరసింహ' మూవీ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ రెస్పాన్స్ సాధించింది. ఈ సినిమా అందరినీ ఆకర్షించి రికార్డు స్థాయిలో కలెక్షన్లు సంపాదిస్తుంది. ఇప్పటికే రూ. 150 కోట్లు వరకు కలెక్షన్ రాబట్టింది. ఒక యానిమేషన్ చిత్రానికి ఇండియాలో ఇంతటి వసూళ్లు రావడం ఇదే తొలిసారని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్టార్ హీరోలు, పెద్ద డైరెక్టర్, భారీ సెట్లు లేకుండానే వసూళ్ల వర్షం కురిపిస్తున్న మూవీకి రోజురోజకు విపరీతంగా క్రేజ్ పెరుగుతోంది. ఇప్పుడప్పుడే ఈ క్రేజ్ తగ్గేలా లేదని లాంగ్ రన్ లో ఈ మూవీ రూ. 250 కోట్ల వరకూ కలెక్ట్ చేస్తుందని అంచనాలు ఉన్నాయి.
యానిమేటెడ్ చిత్రం మహావతార్ నరసింహను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. అయితే మహా విష్ణువు దశావతారాల ఆధారంగా పదేళ్లపాటు వరుసగా సినిమాలు రూపొందనున్నాయి. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో మేకర్స్ ఏడాదికి ఓ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై సినిమా నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా అన్ని థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తోంది. దీని ఓటీటీ డీల్స్ ఇంకా ఖరారు చేయలేదని పేర్కొంది.

అయితే ఈ మూవీని ప్రేక్షకులకు అందించేందుకు డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఎన్నో కష్టాలు పడ్డాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ మూవీని నిర్మించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తన భార్యతో కలిసి తామే నిర్మించినట్లు తెలిపారు. ఆఖరికి ఇళ్లు తాకట్టు పెట్టి వడ్డీలు కడుతూ సినిమాను పూర్తి చేశామన్నారు. అంతా దేవుడిపైనే భారం వేసి సినిమా తీశామన్నారు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.












Click it and Unblock the Notifications