తనపై కుట్ర చేసిన హీరో కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడు: సుమన్
తెలుగు, తమిళం, కన్నడంతోపాటు మళయాళంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతి నాయకుడిగా నటుడు సుమన్ రాణిస్తున్నారు. ఒకప్పుడు మంచి స్టార్ హీరోగా మలుపు తీసుకోబోయే తరుణంలో అకస్మాత్తుగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఓ కేసులో సుమన్ పేరును కావాలనే చేర్చి ఆయన కెరీర్ ను తలకిందులు చేశారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. ఆ సంఘటన జరగకుండా ఉంటే సుమన్ ఈరోజున చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సరసన ధీటుగా మరో స్టార్ హీరోగా నిలబడేవారు.
కర్మ ఫలితం ఎవరినీ వదిలిపెట్టదు
తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి, తనకు జరిగిన అన్యాయం గురించి తరుచుగా సుమన్ ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంటారు. కర్మ ఫలితం ఎవరినీ వదిలిపెట్టదని, తనపై ఎవరో కుట్ర చేశారని, అది తనకు కూడా తెలియదని, కానీ దాని ఫలితాలు మాత్రం వారు అనుభవించాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఆ విషయం, ఆ సమయంలో తాను బాధపడలేదని, కానీ తన తల్లి మాత్రం తీవ్రంగా ఏడ్చిందని, ఎంతో బాధను అనుభవించిందని, తనకంటే తన తల్లినే ఎక్కువగా బాధపెట్టారని, ఆ సంఘటనతో తన తల్లి తీవ్రంగా కుంగిపోయిందని సుమాన్ భావోద్వేగానికి గురయ్యారు.

కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు
ఎవరు చేసిన కర్మకు ఫలితాన్ని వారే అనుభవించక తప్పదని, మనది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్న దేశమని, ఎవరు కుట్ర చేశారో తెలియకపోయినప్పటికీ ఆ కర్మను తాను అనుభవించానన్నారు. ప్రస్తుతం మనం ఎందరినో చూస్తున్నామని, వారు అలా మరణించారు.. వీరు ఇలా మరణించారంటూ మాట్లాడుకుంటుంటామని, లేదంటే వారి కుటుంబంలో అలా అయ్యిందంటూ చెబుతుంటారని, అది వారి కర్మ ఫలమని, దాన్ని ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
ఇతరులను శిక్షించడానికి తాను ఎవరినని సుమన్ ప్రశ్నించారు. నీలిచిత్రాల కేసులో సుమన్ ను కావాలనే ఇరికించారని దర్శకుడు సాగర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ఆయన చెప్పిన విషయాల ప్రకారం ఆ కేసు ప్రమేయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఓ రౌడీషీటర్ పాత్ర ఉందని ఆ ఇంటర్వ్యూలో సాగర్ వెల్లడించారు. స్టార్ హీరోగా ఓ వెలుగు వెలగాల్సిన సుమన్ కు అన్యాయం జరిగిందని సాగర్ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications