శ్రీదేవి ఆస్తుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన బోనీ కపూర్
భారతీయ సినీ పరిశ్రమలో తన అద్భుత నటనతో, అందంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అతిలోక సుందరి శ్రీదేవి, అకాల మరణం తర్వాత కూడా వివాదాల నుంచి తప్పించుకోలేకపోయారు. ఆమె మరణం తర్వాత, ఆమె సంపాదించిన ఆస్తులు భర్త బోనీ కపూర్ మరియు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ పేరిట బదిలీ అయ్యాయి. అయితే, తాజాగా చెన్నైలో శ్రీదేవి కొనుగోలు చేసిన ఒక విలువైన ఆస్తిపై ముగ్గురు వ్యక్తులు కన్నేసి, అది తమకే చెందుతుందని వాదిస్తున్నారు.
ఈ వ్యవహారంపై బోనీ కపూర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. శ్రీదేవి 1988లో ఎం.సి. సంబండ ముదలైర్ నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేశారని, అయితే ఆ ముదలైర్ రెండో భార్య కొడుకులమని చెప్పుకుంటున్న ఆ ముగ్గురు వ్యక్తులు, నకిలీ వారసత్వ ధ్రువీకరణ పత్రాలతో ఆ స్థలాన్ని అక్రమంగా పొందారని బోనీ కపూర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నకిలీ ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలని కోరారు.

ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేష్, ముదలైర్ మొదటి భార్య బతికి ఉండగానే రెండో పెళ్లి చేసుకోవడం హిందూ వారసత్వ చట్టం ప్రకారం చెల్లదని స్పష్టం చేశారు. అందువల్ల రెండో భార్య కొడుకులు చట్టపరమైన వారసులు కాలేరని పేర్కొన్నారు. ఈ మోసపూరిత ధ్రువీకరణ పత్రంపై నాలుగు వారాల్లోగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని తాంబరం తాలూకా తహశీల్దార్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో, తహశీల్దార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications