రెస్టారెంట్ స్టైల్ "బటర్ గార్లిక్ ప్రాన్స్" ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే..?
సీఫుడ్ ప్రియులకు రొయ్యలతో చేసే వంటకాలు ఎప్పుడూ ప్రత్యేకమే. అందులోనూ బటర్ గార్లిక్ ప్రాన్స్ (Butter Garlic Prawns) అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే వంటకం. వెన్న సువాసన, వెల్లుల్లి ఫ్లేవర్, మిరియాల కారంతో కలిసిన ఈ ప్రాన్స్ చాలా తక్కువ సమయంలోనే రెడీ అవుతాయి. ప్రత్యేక సందర్భాల్లో స్టార్టర్‌గా, వీకెండ్ డిన్నర్‌లో సైడ్ డిష్‌గా లేదా ఫ్రైడ్ రైస్, నూడుల్స్‌తో కలిపి కూడా ఈ వంటకాన్ని ఆస్వాదించవచ్చు.
కేవలం 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ వంటకంలో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడే విధంగా ఉండడమే కాకుండా పార్టీలు, ప్రత్యేక సందర్భాలకు పర్ఫెక్ట్ స్టార్టర్ గా నిలిస్తోంది. వెన్న, వెల్లుల్లి, మిరియాల సువాసనతో నోట్లో కరిగిపోయే బటర్ గార్లిక్ ప్రాన్స్ ఒకసారి ట్రై చేస్తే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపించడం పక్కా అంటున్నారు. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ పొందవచ్చు. మరి ఆలస్యం ఎందుకు.. రుచికరమైన బటర్ గార్లిక్ ప్రాన్స్‌ను ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం...

కావలసిన పదార్థాలు..
పచ్చి రొయ్యలు - అరకిలో (శుభ్రం చేసినవి)
వెన్న (Butter) - 3 టేబుల్ స్పూన్లు
నూనె - 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి తరుగు - 3 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 2 టీస్పూన్లు
మిరియాల పొడి - అర టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్ లేదా కారం - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూన్
పసుపు - చిటికెడు (ఐచ్ఛికం)
వెన్న ఫ్లేవర్ కోసం కొద్దిగా డ్రై హెర్బ్స్ లేదా ఒరేగానో (ఐచ్ఛికం)
ముందుగా రొయ్యలను ఎలా సిద్ధం చేయాలి?
రొయ్యలను బాగా శుభ్రం చేసి, వాటి పై భాగంలోని నల్లటి నరాన్ని తొలగించాలి. ఇలా చేస్తే రుచి మరింత మెరుగ్గా ఉంటుంది. అనంతరం నీరు పూర్తిగా వంపేసి పొడిగా ఉంచాలి.
రొయ్యల మ్యారినేషన్..
ఒక బౌల్‌లో రొయ్యలు తీసుకుని అందులో.. కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ లేదా కారం.. ఒక టీస్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు వేసి బాగా కలిపి 10-15 నిమిషాల పాటు మ్యారినేట్ చేయాలి. దీంతో రొయ్యలకు మంచి ఫ్లేవర్ వస్తుంది.
తయారీ విధానం..
స్టవ్‌పై ఒక పాన్ పెట్టి అందులో నూనె, వెన్న వేయాలి. వెన్న ఒక్కటే వేస్తే త్వరగా మాడిపోతుంది కాబట్టి కొద్దిగా నూనె కలపడం మంచిది.
వెన్న కరిగిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఈ దశలోనే అద్భుతమైన సువాసన వస్తుంది.
ఇప్పుడు మ్యారినేట్ చేసిన రొయ్యలను పాన్‌లో వేసి మీడియం మంటపై 3-4 నిమిషాలు మాత్రమే ఉడికించాలి. ( రొయ్యలు ఎక్కువసేపు ఉడికిస్తే గట్టిగా, రబ్బర్‌లా మారిపోతాయి. కాబట్టి ఎక్కువగా ఉడికించకూడదు)
రొయ్యలు గులాబీ రంగులోకి మారిన తర్వాత మిగిలిన నిమ్మరసం, కొత్తిమీర తరుగు చల్లి బాగా టాస్ చేయాలి.
చివరిగా కావాలంటే కొద్దిగా డ్రై హెర్బ్స్ లేదా ఒరేగానో చల్లుకోవచ్చు.
సర్వింగ్ సూచనలు..
వేడివేడిగా ఉన్న బటర్ గార్లిక్ ప్రాన్స్‌ను రైస్‌తో, గార్లిక్ బ్రెడ్‌తో.. చపాతీ లేదా నాన్‌తో స్టార్టర్‌గా టమాటో సాస్ లేదా మయోనైజ్‌తో సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటాయి.












Click it and Unblock the Notifications