మొదటిసారి విడుదలైతే రూ.7కోట్లు.. రెండోసారి రూ.50 కోట్లు
ప్రస్తుతం ఒక్క తెలుగు, తమిళం అనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని చలనచిత్ర పరిశ్రమల్లో కొన్ని సినిమాలను తిరిగి విడుదల చేయడం అనే ట్రెండ్ కొనసాగుతోంది. ప్రధానంగా స్టార్ హీరోల సినిమాలు తిరిగి విడుదలవుతుంటాయి. మన తెలుగులో కూడా అలాగే జరుగుతోంది. ప్రింట్ ను శుభ్రం చేసి, డీటీఎస్, డాల్బీ అట్మాస్ లాంటి శబ్ద సాంకేతికతను జోడించి, 4కె, 8కె రిజల్యూషన్ తో థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ ఖర్చులన్నీ కలిపి రూ.50 లక్షల్లోపే అవుతాయి. తిరిగి విడుదలైన తర్వాత కనీస మొత్తంలో రూ.2 కోట్లన్నా వస్తున్నాయి. అవన్నీ నిర్మాతకు లాభమే.
ఫిబ్రవరి ఏడోతేదీన విడుదలైంది
అయితే హిందీలో ఓ ఫ్లాప్ సినిమాను తిరిగి విడుదల చేస్తే బ్లాక్ బస్టర్ గా నిలిచి ఇప్పటివరకు రూ.50 కోట్లు రాబట్టింది. హీరోగా హర్షవర్ధన్ రాణే, హీరోయిన్ గా మౌరా హోకేనే నటించిన సనమ్ తేరి కసమ్ తిరిగి విడుదలైంది.ఈ సినిమాలో హీరో హీరోయిన్లిద్దరూ కొత్తవారే. ఈ సినిమా తొలిసారి 2016లో విడుదలైంది. అప్పుడు ఫ్లాప్. కేవలం రూ.7 కోట్లు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ మాత్రం రూ.15 కోట్లు. 2016లో సనమ్ తేరి కసమ్ పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. తిరిగి అదే సినిమాను నిర్మాతలు ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేశారు. ఊహించనిరీతిలో సనమ్ తేరి కసమ్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఆశ్చర్యపోతున్న సినీ వర్గాలు
బాక్సాఫీస్ వద్ద భారీ వసూల్లు రాబడుతోంది. ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు రూ.5.14 కోట్లు, రెండోరోజు రూ.9.5 కోట్లు.. ఇలా రోజురోజుకు వసూళ్లను పెంచుకుంటూ మొదటివారంలో రూ.30.67 కోట్లను రాబట్టింది. తాజాగా సనమ్ తేరి కసమ్ రూ.50 కోట్లు దాటేసింది. ఈ కలెక్షన్లు చూసి సినీ విమర్శకులు, సినీ విశ్లేషకులు, దర్శక నిర్మాతలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 2016లో భారీ ఫ్లాప్ గా నిలిచిన సినిమా ఇప్పుడు రూ.50 కోట్లు సాధించి ఇంకా సాధించే దిశగా దూసుకుపోతుండటంపై విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్రిస్టోఫర్ నోలన్ 'ఇంటర్స్టెల్లార్' వంటి సినిమాలు విడుదలైనప్పటికీ ఆ పోటీని తట్టుకొని మరీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మున్ముందు మరెన్ని కలెక్షన్లు వస్తాయో చూడాలి.












Click it and Unblock the Notifications