H1B, F1 Visa: అమెరికా ఎయిర్‌పోర్టుల్లో ఐసీఈ అటాక్.. భారతీయుల్లో ఆందోళన!
అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, ముఖ్యంగా ఉద్యోగాలు చేసే హెచ్-1బీ వీసాదారులు, చదువుకునే ఎఫ్-1 విద్యార్థులు ఇప్పుడు దేశీయంగా ప్రయాణించాలన్నా హడలిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అక్కడి యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఎయిర్‌పోర్టులలో సోదాలు తీవ్రతరం చేశారు.
వీసా గడువు ముగిసిన వారిని, ఇతర ఇమ్మిగ్రేషన్ స్టేటస్ దరఖాస్తులు పరిశీలనలో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని విమానాశ్రయాల్లోనే అదుపులోకి తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్ సర్కార్ నిర్దేశించిన నగరాల నుంచి వెళ్లగొట్టే లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు ఈ తరహా ఆకస్మిక దాడులకు దిగుతుండటంతో భారతీయ నిపుణులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

చెకిన్ కౌంటర్లు, బోర్డింగ్ గేట్ల వద్దే అరెస్టులు!
గతంలో కేవలం క్రిమినల్ రికార్డులు ఉండి, కోర్టు ద్వారా డిపోర్టేషన్ ఆర్డర్లు వచ్చిన వారిని మాత్రమే అధికారులు టార్గెట్ చేసేవారు. కానీ ఇప్పుడు రూట్ మార్చి దేశవ్యాప్తంగా దాదాపు 15కి పైగా కీలక విమానాశ్రయాల్లో నిఘా పెంచారు.
శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెల్స్, డెన్వర్, లాస్ వేగాస్, నాష్‌విల్లె వంటి బిజీ ఎయిర్‌పోర్టుల్లో చెకిన్ కౌంటర్లు, బోర్డింగ్ గేట్ల వద్దే ప్రయాణికులను ఆపి తనిఖీ చేస్తున్నారు. వీసా గడువు తీరినవారు, ఐ-94 రికార్డు కాలపరిమితి పూర్తయినవారు, అలాగే అమెరికా పౌరులను పెళ్లి చేసుకుని ఇంకా గ్రీన్ కార్డ్ రాని వారిని కూడా విచారించి కస్టడీలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.
చట్టబద్ధమైన పత్రాలు ఉంటేనే ప్రయాణాలు సురక్షితం!
ఈ ఆపరేషన్లు ముఖ్యంగా విమానాల్లో తరచూ ప్రయాణించే మన భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఉద్యోగ రీత్యా లేదా యూనివర్సిటీ పనులపై అంతర్గతంగా ప్రయాణించే వారు తమ వద్ద వీసా పొడిగింపు , లేదా స్టేటస్ మార్పు కోసం పెట్టుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం దరఖాస్తు పెండింగ్‌లో ఉందని చెబితే సరిపోదని, తమ దగ్గర చట్టబద్ధంగా ఉండేందుకు కావాల్సిన సరైన ఆధార పత్రాలు చూపిస్తే తప్ప ఇమ్మిగ్రేషన్ అధికారులు వదలడం లేదని న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు.
అధికారుల తీరుపై విమానయాన సంస్థల ఆగ్రహం!
మరోవైపు ఎయిర్‌పోర్టులు, విమానాల్లోకి ప్రవేశించి తనిఖీలు చేపట్టడంపై వివిధ ఎయిర్‌లైన్స్ కంపెనీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ప్రయాణికులను అరెస్ట్ చేయడానికి సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలోకి ఎక్కడానికి ప్రయత్నించిన ఐసీఈ అధికారిని విమానయాన సిబ్బంది అడ్డుకోవడం అక్కడ తీవ్ర కలకలానికి దారితీసింది.
అంతేకాకుండా విమానయాన సంస్థల్లో పనిచేసే సిబ్బంది వీసా గడువు పూర్తయితే వారిని కూడా వదలకుండా విధి నిర్వహణలోనే అరెస్ట్ చేయడం విశేషం. ఏది ఏమైనా అమెరికాలో ఉంటున్న విదేశీయులు ప్రస్తుత పరిస్థితుల్లో విమాన ప్రయాణాలు చేసేటప్పుడు అన్ని పత్రాలు దగ్గర ఉంచుకోవడం చాలా అవసరం.




Click it and Unblock the Notifications