హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్విక్ బాక్సింగ్: దేవుడూ హ్యాండిచ్చేశాడు!

By Pratap
|
Google Oneindia TeluguNews

నా తపస్సుకి మెచ్చి ఏ బ్యూటిఫుల్ ఏంజిలో వచ్చి నరుడా ఏమి నీ కోరిక అని అడుగుతుందనుకుంటే తమరొచ్చారు సార్ తమరెవరు సార్ అన్నాడో తపస్సు చేస్తున్న మనిషి.

నన్నే... ఎవరని అడుగుతున్నావా? నా కోసం ఒంటి కాలు మీద తపస్సు చేసి చాంతాడంత గడ్డమూ ఎలుగుబంటి జుట్టూ పెంచి కాిసంత కూడా కండ లేకుండా అస్థిపంజరంలా నిలబడ్డావు. నన్నే గుర్తు పట్టలేదా? ఇంత కండ లేని కావరమా? అన్నాడు వచ్చినవాడు మనిషి కానివాడు.

సారీ.. గుర్తు పట్టలా... ఎందర్నో చూస్తుంటాం.. ఎందర్నని గుర్తు పెట్టుకుంటాం. మీరెవరో ఎందుకిలా నన్ను డిస్ట్రబ్ చేశారో చెప్తే కళ్లు మూసుకుని మళ్లీ నా తపస్సు లాగించేస్తాను.

చాల్లే.. ఇంకానా. తప్పు గిపస్సూ. చేసింది చాలు. నేనే నీ తపస్సుకి మెచ్చి వచ్చిన దేవుణ్ని. నన్ను బాగా లోతుగా పరీక్షగా చూడు నీకు తెలుస్తుంది.

Chintapatla sudarshan quick boxing on leaders' promises

నో.. నేనమ్మను. నిజంగానే... దేవుడివా నువ్వు.... అచ్చంగా మనిషిలా వున్నావు. జీన్స్ పాంటూ టీ షీర్టూ వేసుకుని వచ్చావు.. నో... నువ్వు దేవుడివి అవ్వడానికి వీల్లేదసలు.

నువ్వంటే దేవుడు దేవుడు కాకుండా పోడు. దేవుడెప్పుడే దేవుడే. నేనే దేవుడ్ని. మీ మనుషులంతా నన్ను మీ ఆకారంలోనే కదా తయారు చేసి గుళ్లో కదలడానికి వీల్లేకుండా నిలబెట్టారు. మనిషి లాగే దేవుడికీ కాళ్లూ చేతులూ మెడా తల.. దాని మీద ఓ బరువైన కిరీటమూ పెట్ిట ఎప్పుడు ఎవర్నో ఒకర్ని చావగొడతాననే దానికి గుర్తుగా గదాచక్రమూ బాణమూ నా చేతుల్లో వుంచి నిలబెట్టారు కదా. నేను కూడా మీలాగానే వుండాలని ఎవడు మనసులో అనుకుంటారో అలాగే కనబడ్తానురా...

రా అంటున్నావు... మర్యాద లేదా? అన్నాడు చిరాకు పడుతూ మనిషి.

ఒరేయ్ నేను చేసిన బొమ్మల్ని రా అనుకుండా ఏమండీ.. సార్... అని పిలవాల్నా.. టైం వేస్ట్ చేయకు. నా కోసం అంటే దేవుడి కోసం దేవుళ్లాడే వాళ్లు చాలా మందున్నారు క్యూలో.

మనిషి దేవుడ్ని ఎగాదిగా చూశాడు. ఈ శాల్తీ నిజంగా దేవుడవునో కాదో తెలీడం లేదు. అసలు దేవుడి చుట్టూ వెలుతురు చక్రం లేదు. చేతిలో ఏ ఆయుధమూ లేదు. ఎవర్నయినా శిక్షించాల్సి వస్తే యేం చేస్తాడు. పైగా పట్టు పంచె లేదు. దేవుడ్నంటున్న ఈ మనిషి మనిషిలాగా ఉన్న ఈ మనిషి దేవుడెలా అవుతాడు. దేవుడా నువ్వు దేవుడివని నమ్మక తప్పదా అనుకున్నాడు.

లోలోపల నువ్వు అనుకుంటున్నవన్నీ నాకు తెలుస్తున్నాయి. పట్టు పంచె బోరు కొట్టి జీన్స్ ప్యాంటులో వచ్చా. నాకిష్టమైన డ్రెస్సులో వచ్చా. నీకేం పోయే కాలం. వరమేదైనా కావాలంటో అడుగు యిస్తా లేకపోతే డిజప్పియర్ అయిపోతానన్నాడు మనిషి లాంటి దేవుడు.

డిజప్పియర్ అయిపోతానన్న దేముడి వైపు కొరకొకరా చూస్తూ మనిషి ఎన్ని వరాలిస్తావు... ఎన్నిటికి ఛాన్సిస్తావు అన్నాడు దేవుడ్నని చెప్పిన వాడితో మనిషి.

దేవుడి ముఖంలో రంగు మారింది. అడుగు నరుడా నాకు చేతయింది యిస్తా. యిదివరకులా పవర్ ఫుల్‌గా లేను కొంచెం ఈజీ వరాలు అడిగితే యిచ్చేసి బతుకుదేముడా అంటూ గాయబ్ అయిపోతాను అన్నాడు దేవుడు.

చూస్తున్నావుగా దేవుడూ పీల్చడానికి గాలి కూడా లేక అల్లాడుతున్నారు జనం. అందరికీ సరిపోయే స్వచ్ఛమైన గాలి వీచేట్టు చేయి అన్నాడు మనిషి ఉక్కతో చెమట్లు కక్కుతూ.

సారీ ఫిగరయ్యాడు దేవుడు. ఏం చెప్పమంటావు, నరుడా.. పుష్కలంగా యిచ్చాను గాలి భూమ్మీద కావల్సినంత గాలికి ఏర్పాటు చేశా. దాన్ని కాలుష్యానికి గురి చేశారు మీ మనుషులు. సారీ.. ఈ వరం నేనియ్యలేను.

స్వచ్ఛమైన గాలియ్యలేనంటావు. ఇచ్చిందాన్ని మేమే కల్తీ చేశామమంటావు. పోనీ దాహంగా వుంది, ఓ .. గ్లాసెడు జీరోబీ నీళ్లన్నా యిప్పించు.

ఇచ్చిన నీళ్లన్నీముర్కికాలవలు చేశారు. సముద్రాల్లో సాల్టుని నీ కోసం మింగేసి నేను హైబీపి తెచ్చుకోలేను. నా వల్ల కాదు. టాంకర్లలో నీళ్లమ్మనుకునేవాళ్లున్నారు వెళ్లి కొనుక్కో. నేను కొనుక్కున్న నీళ్ల బాటిల్ ఖాళీ అయింది చూడు ఉన్నాడు దేవుడు ఖాళీ వాటర్ బాటిల్ని తలకిందులుగా ఊపాడు దేవుడు.

పిచ్చి కోపం వచ్చింది దేవుడి మీద నరుడికి. ఏం దేవుడు? ఏదడిగినా హేండిస్తున్నాడు. ఇదివరకు ఇదివరకు యేదడిగినా యిచ్చేవాడన్నారు అని కుతకుత ఉడికిపోతూ ఈ దేవుడి కన్నా మా నాయకులు, మంత్రులు ఎంతో గొప్పోళ్లు. లక్షల ఉద్యోగాలు విదిలిస్తారు, గరీబోళ్లకు ఇళ్లు కట్టిస్తారు, రోడ్ల మరమ్మత్తుకు కోట్లు కురిపిస్తారు. అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని మరపిస్తారు. దేవుడు దేవుడని దేవుళ్లాడటం వేస్ట్. ఖాళీ చేతులు వూపుతూ వాగ్దానాలు పంపకం చేసే లీడర్లే గొప్పోళ్లు. గొప్ప హాంఫట్ జాదూగాళ్లు. దేవుడ్నని అంటున్న ఈ దేవుడి దగ్గర ఏ జాదూ వున్నట్టు లేదు... అనుకుంటూ నిలువు గుడ్లేసుకుని దేవుడ్ని చూస్తున్న మనిషితో దేవుడు -

నీ బాధ నాకర్థమయిందిరా. నువ్వడిగిన వరాలు యివ్వలేనందుకు బాధగా వుంది. కానీ నేను మీ లీడర్లలా జాదూగర్‌ని కాదు.

దేవా.. దేవాధిదేవా అలా అనకు. నువ్వు తల్చుకుంటే ఏదయినా చేస్తావంటారు గదా అన్నాడ మనిషి డిలా పడి.

చింతించకురా హ్యూమన్ బీయింగ్. ఎన్నికల ముందర ఏ నాయకుడయినా వరాలు యివ్వడంలో దేవుడ్ని బీట్ చేస్తాడు. కానీ నీ తల్లో వున్నదాన్ని కొంచెం వాడి చూడు. నేను యిచ్చేది యిస్తే.. అది వరు.. అది అక్షర సత్యం. నాయకుడు యిచ్చేది వాగ్దానం. అది రిక్తహస్తం. ఖాళీ చేతుల్నీ, వాగ్దానాల నీటి మూటల్నీ నమ్ముకోకు. వాడు చెప్పేది చేయ్యనే చెయ్యడు. నేనెప్పుడు యేం చేస్తానో చెప్పనే చెప్పను. నీకో దేవరహస్యం చెప్పనా? అసలు ఈ కలికాలంలో డెమాక్రసీ కాలంలో నువ్వే దేవుడివి. నువ్వు ఓటు వరమిచ్చేవాడివి. నరుడా ఏమి నీ కోరిక అని అడిగే దేవతనీ చూపుడు వేలి చివరనే వుంది చూసుకో... అంటూ ఎప్పుడు యేం చేస్తానో చెప్పనన్న దేవుడు చెప్పకుండా మాయమైపోయాడు.

English summary
Prominent columnist chintapatla Sudarshan in his quick boxing says about the false promises made by political leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X