దేశీ థియేటర్ లెజెండ్

Habib Tanvir
భారత దేశం మరిచిపోలేని, మరిచిపోకూడని అద్భుతమైన ధియేటర్ ఆర్టిస్టు హబీబ్ తన్వీర్. భారత నాటక రంగంలో మూస ధోరణులను స్వస్తి చెప్పి దేశీయతను ప్రవేశపెట్టిన సృజనశీలి. దేశీయ సంస్కృతిని ఆయన నాటకాలు ప్రతిబింబిస్తాయి. నాటక ప్రక్రియకు సంబంధించి రూపంలోనూ, ఇతివృత్తంలోనూ ఆయన విప్లవం తెచ్చాడు. స్థానికుల నుంచే నటులను ఎన్నుకుని ఆయన నాటక ప్రదర్శనలో కొత్త పంథాకు శ్రీకారం చుట్టాడు. 1975లో రూపకల్పన చేసిన ఆయన చరణ్ దాస్ చోర్ నాటకం అద్భుతమైన నాటకం. ఇది నాటక ప్రియులకు ఎప్పటికీ నూతనంగానే కనిపిస్తుంది. ఈ నాటక రచనకు ముందు ఆయన నాటక రంగానికి సంబంధించి వివిధ ప్రయోగాలు చూశారు.

ప్రస్తుత ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని రాయపూర్ లో జన్మించిన ఆయన అక్కడే తన కళాభిరుచికి పదును పెట్టుకున్నారు. అలిఘర్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్న తన్వీర్ ఆ తర్వాత ముంబైకి, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఆయన ఆగ్రా బజార్ అనే నాటకానికి రూపకల్పన చేశారు. అప్పటి వరకు థియేటర్ కృషిని దేశీ సంప్రదాయాలను పాటించిన సందర్భాలు లేవు. అయితే ఈ విషయంలో తన్వీర్ తనదైన విశిష్టతను చూపారు. ఢిల్లీ నాటక ప్రియులు కనీవినీ ఎరుగని రీతిలో ఆ నాటకం ద్వారా తన్వీర్ రూపంలోనూ, ఇతివృత్తంలోనూ విప్లవానికి శ్రీకారం చుట్టారు.

ఆ తర్వాత ఆయన నాటక రంగాన్ని అధ్యయనం చేయడానికి ఇంగ్లాండు వెళ్లారు. మూడేళ్ల పాటు రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్, బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ స్కూల్లో అధ్యయనం సాగించారు. బ్రెక్ట్ నాటకాలను అదే పనిగా వీక్షించారు. సొంత సాంస్కృతిక సంప్రదాయాలను, సందర్భాలను తీసుకోకుండా సామాజికంగా అర్థవంతమైన, కళాత్మకంగా ఆసక్తికరంగా నాటకాలను రూపొందించలేమని ఆయన గుర్తించారు. ఈ కొత్త అవగాహనతో ఆయన దేశీయతను, జానపద కళను తన నాటకాలకు ప్రధానం చేసుకున్నారు. స్థానికుల నుంచే కళాకారులను ఎంపిక చేసుకున్నారు. స్థానిక భాషనే వాడడానికి నటులను అనుమతించారు.

శూద్రకుడి మృచ్ఛకటికం నాటకాన్ని మిట్టీ కీ గాడీ పేర రూపొందించి ప్రదర్శించారు. ఛత్తీస్ ఘడ్ కు చెందిన ఆరుగురు జానపద కళాకారులను దీనికి ఎంచుకున్నారు. జానపద నాటక రంగం సంప్రదాయాలను, పద్ధతులను స్వీకరించారు. తద్వారా పూర్తిగా భారత రూపాన్ని, శిల్పాన్ని ప్రదర్శించారు. భార్య మోనికా మిశ్రాతో కలిసి 1959లో నయా థియేటర్ ను ఏర్పాటు చేశారు. ఆయన పలు సంస్కృత నాటకాలను, సొంత నాటకాలను ప్రదర్శించి నాటక రంగంలో ఒక లెజెండ్ గా నిలిచిపోయారు. నిజమైన సృజనశీలి కళను సృష్టించే సమయంలో తన జ్ఞాన సంపదను వదిలేయాలనే విషయాన్ని ఆయన నేర్చుకున్నారు. జ్ఞానం బరువు కృత్రిమ సృష్టికి కారణమవుతుంది. ఆయన చరణ్ దాస్ చోర్ నాటక రంగంలో పనిచేసే వారికి ఒక ప్రేరణ, ఒక అధ్యయ గ్రంథం. చరణ్ దాస్ చోర్ ప్రేరణతో తెలుగులో దెంచనాల శ్రీనివాస్ దొంగ సత్తయ్య నాటకానికి రూపకల్పన చేసి ప్రదర్శించారు. సినిమాల జోరులో నాటక రంగం కళ తప్పుతున్న సమయంలో దొంగ సత్తయ్య నాటకం నాటక ప్రియులను, సాహితీవేత్తలను, మేధావులను విశేషంగా ఆకర్షించింది. పలు ప్రదర్శనలకు కూడా నోచుకుంది.

భారత నాటక రంగంలో సృజనాత్మకతను, ప్రయోజానాన్ని జోడించి అద్భుతమైన ప్రయోగాలు చేసిన హబీబ్ తన్వీర్ భౌతికంగా మన ముందు లేరు. కానీ ఆయన తన నాటకాల ద్వారా మనకు ఎప్పుడూ గుర్తుంటారు. ఆయనకు నివాళి అర్పిద్దాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+