బాబుకు నచ్చడం లేదా?

Chandrababu Naidu
అనుకున్నదొకటి, అయింది మరోటి కావడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర నిస్పృహతో కొట్టు మిట్టాడుతున్నట్లు కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వం కూలిపోతుందని, ఎన్నికలు వస్తాయని భావించిన ఆయన కలలు కల్లయ్యాయి. పైగా ఆయనపై ముప్పేట దాడి మొదలైంది. రాజకీయ పరిణామాలు తాను ఊహించినట్లుగానో, తాను నడిపించదలుచుకున్న తీరులోనో లేకపోవడం చంద్రబాబుకు మింగుడు పడడం లేదు. దీంతో ఆయన తీవ్ర అసహనంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది శాసనసభలో ఆయన వ్యవహరిస్తున్న తీరు పట్టిస్తోందని అంటున్నారు.

ముఖ్యమంత్రి రోశయ్య నిలదొక్కుకోవడం కష్టమని ఆయన భావించారు. తొలుత కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యవహారం రోశయ్యకు కొరకరాని కొయ్యగా తయారవుతుందని భావించారు. వైయస్ జగన్ వర్గం రోశయ్య ప్రభుత్వాన్ని కూలదోస్తుందని, దాని వల్ల తిరిగి రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయని ఆయన ఊహించారు. అయితే, వైయస్ జగన్ వ్యవహారానికి తెలంగాణ అంశం అడ్డుకట్ట వేసింది. తెలంగాణ వ్యవహారంతో వైయస్ జగన్ వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. అయితే, తెలంగాణ అంశం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని సృష్టిస్తుందని ఆయన అనుకున్నారు. దానికి ఆయన ఆజ్యం పోయాలని భావించారు. అందులో భాగంగా ఇటు తెలంగాణ పార్టీ నాయకులను ప్రోత్సహిస్తూనే, అటు సీమాంధ్ర పార్టీ నాయకులను రెచ్చగొట్టారు. కాంగ్రెసులో సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెసు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం పెరుగుతుందని, దాని వల్ల రోశయ్య ప్రభుత్వం కష్టాల్లో పడుతుందని అనుకున్నారు. దాన్ని వేగవంతం చేయడానికి తెలంగాణ పార్టీ నాయకులను జెఎసిలో చేర్చి రాజీనామాల పర్వాన్ని వేడెక్కించే ప్రయత్నం చేశారు. అయితే, కాంగ్రెసు శాసనసభ్యులను కట్టడి చేయడంలో కాంగ్రెసు అధిష్టానం సఫలమైంది. దీంతో చంద్రబాబు రెండో ఆశ కూడా అడుగంటింది.

రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం చంద్రబాబు మాత్రమే ఆత్మరక్షణలో పడ్డారు. ఆయనపై మూడు వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి కె. రోశయ్య రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోవడానికి ఆవసరమైన బలాన్ని, స్థిరత్వాన్ని సంపాదించుకున్నారు. వైయస్ జగన్ బలహీనపడుతున్న కొద్దీ రోశయ్య బలపడుతూ వస్తున్నారు. వైయస్ జగన్ బలహీనపడడానికి చంద్రబాబు ఎంచుకున్న మార్గాలు కూడా కారణమయ్యాయి. దివంగత నేత వైయస్ హయాంలో నియమితులైన అధికారులను ఆయన లక్ష్యంగా ఎంచుకున్నారు. మరోవైపు గాలి సోదరులకు చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ వ్యవహారాలపై యుద్ధం ప్రకటించారు. తెలంగాణ వ్యవహారంలో రాజకీయ సంక్షోభ ఎత్తుగడను ఎంచుకున్నారు. దీంతో వైయస్ జగన్ రాజకీయంగా బలహీనపడ్డారు. ఈ రకంగా కాంగ్రెసు అధిష్టానానికి రోశయ్యను నిలబెట్టడానికి పరోక్షంగా చంద్రబాబు సహాయ పడ్డారు.

కాగా, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడే. చంద్రబాబును బలహీనపరచడానికి చిరంజీవి కాంగ్రెసుకు చేయూత అందించడానికి కూడా వెనకాడడం లేదనే ప్రచారం ఉంది. అందులో నిజం లేకపోలేదు కూడా. చంద్రబాబు, చిరంజీవి సామాజిక వర్గాల మధ్య మొదటి నుంచి ఉన్న వైరం చిరంజీవిని నడిపిస్తోందని అంటున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చిరంజీవితో ఎప్పటికప్పుడు సంబంధాల్లో ఉండడానికి కూడా కారణం ఇదేనని అంటున్నారు.

మరోవైపు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు లక్ష్యం కూడా చంద్రబాబే కావడం యాదృచ్చికమేమీ కాకపోవచ్చు. తెలంగాణ విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనక్కి వెళ్లిందని ఆయన ఉద్దేశం. తెలంగాణ అంశాన్ని చంద్రబాబు ఓట్ల కోసం, ఆ తర్వాత రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చడానికి మాత్రమే చంద్రబాబు ఎంచుకున్నారని ఆయన భావిస్తున్నారు. దీంతో కెసిఆర్ చంద్రబాబును బలహీనపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తెలంగాణ జెఎసి తెలుగుదేశం పట్ల వ్యవహరిస్తున్న తీరు, చంద్రబాబును హైదరాబాదులో కూడా తెలంగాణవాదులు అడ్డుకుంటున్న తీరు ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.

మొత్తం మీద, చంద్రబాబు వ్యూహాలు బెడిసికొడుతున్నట్లే ఉంది. రెండు పత్రికల అండదండలు, తన సామాజిక వర్గానికి చెందినవారి నాయకత్వాల్లో ఉన్న రెండు వామపక్షాల మద్దతు తప్ప చంద్రబాబును ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. చంద్రబాబుకు ఇది విషాద సందర్భమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+