మాస్టర్ ప్లాన్: చిరంజీవి, పవన్ కలిసే పనిచేస్తున్నారా?

సమీప భవిష్యత్తులో పవన్‌ కల్యాణ్‌తో కలిసి పని చేసే అవకాశం లేదంటూనే చిరంజీవి భవిష్యత్తు గురించి చెప్పలేమన్నారు. ఆంతర్యమేమిటి...

హైదరాబాద్: ఖైదీ నంబర్ 150 సినిమా విడుదల నేపథ్యంలో కాంగ్రెసు నాయకుడు, మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. కాంగ్రెసుకు పూర్తిగా తాను కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెసుతోనే ఉంటానని కూడా స్పష్టం చేశారు.

అయితే, పవన్ కల్యాణ్ రాజకీయాల గురించి ఆయన చాలా సానుకూల వైఖరిని ప్రదర్శించారు. పవన్ కల్యాణ్‌తో రాజకీయాల్లో కలిసి పనిచేసే అవకాశం లేదంటూనే కలిసి నడవడానికి తగిన అవకాశాలున్నాయనే సూచనలను కూడా చిరంజీవి చేశారు.

ఇప్పటికిప్పుడు పవన్ కల్యాణ్‌తో రాజకీయపరమైన సంబంధం పెట్టుకునే అవకాశం లేదని అన్నారు. అయితే, భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఇప్పుడే చెప్పలేమని కూడా అన్నారు. సుదీర్ఘ భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశం ఉందనే సంకేతాలను ఆయన ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. 2109 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఓడించడమే లక్ష్యంగా వివిధ శక్తుల సమీకరణాలు జరిగే అవకాశాలున్నాయని భావించడానికి వీలు కలుగుతోంది.

దాసరితో చిరంజీవి స్నేహం...

దాసరితో చిరంజీవి స్నేహం...

కేంద్ర మంత్రిగా పనిచేసిన దర్శక నిర్మాత దాసరి నారాయణ రావుకు ప్రజల్లో ఆదరణ దండిగానే ఉంది. కాపు సామాజిక వర్గంలో దాసరిని అభిమానించేవారు అత్యధికులు ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి దాసరి నారాయణరావుతో కలిసి పని చేయడానికి అవసరమైన ప్రాతిపదికను చిరంజీవి లేదా కాంగ్రెసు ఇప్పటి నుంచే ఏర్పాటు చేసుకుంటున్నట్లు భావించవచ్చు. ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజింగ్ ఫంక్షన్‌లో దాసరికి చిరంజీవి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. సినిమా పేరును సూచించింది ఆయనే అని చెప్పుకున్నారు. గతంలో ఇరువురి మధ్య విభేదాలున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ విభేదాలను పక్కన పెట్టి ఇరువురు ఒక్కటైన సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడే వారిని కలిపినట్లు భావించే అవకాశం కూడా ఉంది. చంద్రబాబును ఢీకొట్టడానికి తాము కలిసి పనిచేయక తప్పదనే అభిప్రాయం ఇరువురికి వచ్చినట్లు భావిస్తున్నారు.

ముద్రగడ పద్మనాభంతో కూడా...

ముద్రగడ పద్మనాభంతో కూడా...

ఎన్నికలు సమీపంచేనాటికి చిరంజీవి కాపు ఉద్యమ నేత, ముద్రగడ పద్మనాభంతో కూడా చిరంజీవి కలిసి పనిచేసే అవకాశం ఉంది. ముద్రగడ కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతు ఇస్తూ దాసరి నారాయణ రావు, చిరంజీవి కలిసి ప్రకటన చేశారు. ముద్రగడనే వారిద్దరినీ కలిపారని కూడా భావించడానికి వీలుంది. ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లపై చేస్తున్న పోరాటానికి ఇరువురు కూడా మద్దతు ఇస్తున్నారు.

బీసీలతో సయోధ్యతోనే...

బీసీలతో సయోధ్యతోనే...

కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతూనే ముద్రగడ పద్మనాభం బీసీలతో స్నేహాన్ని కొనసాగించాలని భావిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన ఇటీవల బీసీ నాయకులను పలువురిని కలుసుకున్నారు. తమ ఉద్యమం బీసీలకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టంగానే చెప్పారు. కాపులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదనే ప్రచారాన్ని కొనసాగిస్తూనే బీసీలు తమకు వ్యతిరేకంగా మారడకుండా చూసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

పవన్ కల్యాణ్ దారిలోకి...

పవన్ కల్యాణ్ దారిలోకి...

జనసేన అధినేత వామపక్షాలతో కలిసి రాజకీయం చేయాలనే అభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ఆయన పోటీ చేసే అవకాశాలున్నాయి. కాంగ్రెసుతో ఆయన పొత్తు పెట్టుకునే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. అయితే, ఎన్నికలకు ముందు కాంగ్రెసుతో సీట్ల సర్దుబాటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. అది అన్నయ్య చిరంజీవి కోసమైతే చేయడానికి పవన్ కల్యాణ్ ముందుకు రావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబును ఓడించడానికి అవసరమైతే అటువంటి ఒప్పందానికి పవన్ కల్యాణ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనే అర్థం చిరంజీవి మాటల్లో కనిపిస్తోందని అంటున్నారు.

వైఎస్ జగన్ ఏం చేస్తారు...

వైఎస్ జగన్ ఏం చేస్తారు...

నిజానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మలు, రెడ్లు అధికారం పంచుకుంటున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. తర్వాత అధికారంలోకి వచ్చే సామాజిక వర్గం కాపులే అనేది సోషలిస్టులు చేసిన విశ్లేషణ. ఆ విశ్లేషణకు అనుగుణంగా కాపు ప్రముఖులు అంతా ఒక్క తాటిపైకి వచ్చి జగన్‌ను కూడా ఎదుర్కోవడానికి వ్యూహరచన చేయవచ్చు. చంద్రబాబును, జగన్‌ను ఎదుర్కుని ముందుకు రావాలనేది కాపు సామాజిక వర్గం ఎత్తుగడగా కనిపిస్తోంది. అయితే, జగన్‌ను కాంగ్రెసు పార్టీ చేరదీస్తుందా, అందుకు జగన్ సిద్ధపడుతారా అనేది ప్రశ్న.

చంద్రబాబు వ్యూహం ఏమిటి...

చంద్రబాబు వ్యూహం ఏమిటి...

ప్రస్తుత పరిణామాలను అర్థం చేసుకోలేని స్థితిలో చంద్రబాబు ఏమీ లేరని భావించవచ్చు. కాపులను ఎదుర్కోవడానికి ఆయన ఇప్పటికే తన మంత్రివర్గంలో ఆ వర్గానికి చెందినవారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ముద్రగడ పద్మనాభాన్ని ఎదుర్కోవడానికి కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు నిత్యం వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారు. ముద్రగడ విమర్శలను తిప్పికొట్టడానికి వారు ఎల్లవేళలా పనిచేస్తున్నారు. ఈ స్థితిలో బీసీల మద్దతును కోల్పోకుండా చంద్రబాబు ప్రయత్నించే అవకాశాలున్నాయి.

వారిద్దరు వేర్వేరుగానే, కానీ...

వారిద్దరు వేర్వేరుగానే, కానీ...

పవన్ కల్యాణ్‌కు కాంగ్రెసు పార్టీపై అంతగా నమ్మకం ఉన్న సూచనలు కనిపించడం లేదు. అందుకే ఆయన విడిగా నడిచేందుకు సిద్ధపడ్డారు. ప్రజా సమస్యలపై ఆయన పోరాటానికి ముందుకు వస్తున్నారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల కోసం ఆయన గళమెత్తారు. ప్రత్యేక హోదా, రాజధాని వంటి అంశాలు ఆయనకు ఉండనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రత్యేక సమస్యలపై ఆయన తన దృష్టిని సారించారు. ఆ రకంగా ఆయన అన్ని వర్గాల ప్రజల్లోకి చొచ్చుకుపోవాలని చూస్తున్నారు. కాపు కార్డును వాడకుండా, ఆ మచ్చ తనపై పడకుండా ఆయన జాగ్రత్తపడుతున్నారు. కాపు సామాజిక వర్గం నాయకుడిగా ముద్ర వేయించుకుంటే మిగతా వర్గాలకు దూరమయ్యే ప్రమాదం ఉందనేది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. ఏమైనా, దారులు వేరైనా చిరంజీవి, పవన్ కల్యాణ్ లక్ష్యం ఒక్కటేనని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+