తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారని జరుగుతున్న ప్రచారం ఉత్తదేనా? చంద్రబాబు గురువారం చేసిన ప్రకటన నిజానికి అలాగే అనిపిస్తోంది. రాజకీయాల్లో కుటుంబ వారసత్వానికి తాను దూరంగా ఉంటానని ఆయన చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో ఆయన నవ్వుతూ ఈ విషయం చెప్పారు. ఆయన మాటలను బట్టి లోకేష్ క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోరని, చంద్రబాబు వారసత్వాన్ని స్వీకరించబోరని అర్థాలు తీసుకోవడానికి వీలుంది. అయితే, చంద్రబాబు మాటలకు మరో అర్థం ఉందట. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెసు పార్టీలో వస్తున్న డిమాండ్ పై ఆయన వ్యంగ్యంగా అన్నట్లు భావిస్తున్నారు. జగన్ పై చంద్రబాబు విసుర్లుగానే వాటిని తీసుకోవాలని లోకేష్ విషయానికి వచ్చే సరికి ఆ మాటలకు అర్థాలు మారిపోతాయని అంటున్నారు. ఇటీవలి ఎన్నికల్లో నారా లోకేష్ చంద్రబాబు పోటీ చేసిన కుప్పం శాసనసభా నియోజక వర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీలో వారసత్వ సమస్య చాలా క్లిష్టంగా ఉంది. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్వర్గీయ ఎన్టీఆర్ వారసులు రాజకీయ వారసత్వాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్ వారసత్వం కొనసాగుతుందో, చంద్రబాబు వారసత్వం కొనసాగుతుందో కాలమే నిర్ణయిస్తుంది.