ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ఉంది. స్థానిక సంస్థల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిమ్మ తిరిగే విధంగా దెబ్బ తిన్న ఆయన సొంత పార్టీవారిని ఆడిపోసుకుంటున్నారు. పార్టీలోనే వైయస్ జగన్ వర్గం కుంపటి పెట్టిందని ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పార్టీలోని వారే తనను బలహీనపరిచేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆయన మొర పెట్టుకున్నారట. పార్టీలోనివారు చాలా మంది లోపల వైయస్ జగన్‌కు మద్దతిస్తున్నారని ఆయన ఆరోపించారని సమాచారం. జగన్ దెబ్బకు విలవిలలాడిన ఆయన ఏమీ చేయలేక తన బాధనంతా వ్యక్తం చేశారని అంటున్నారు.
బొత్స సత్యనారాయణ, డిఎల్ రవీంద్రా రెడ్డి, పి. శంకరరావు వంటి కొద్ది మంత్రులు మాత్రమే వైయస్ జగన్‌ను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మిగతా మంత్రులెవరూ వైయస్ జగన్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోనియాకు చెప్పారట. ఏం చెప్పినా ఏముంది, చక్కదిద్దుకోవాల్సింది కిరణ్ కుమార్ రెడ్డే, లేకుంటే అనుభవించాల్సిందే.