మోడీకి షాక్: చెత్త తెచ్చి వేస్తే, బీజేపీ చీఫ్ క్లీనింగ్
ఢిల్లీ: 2019 వరకు జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న క్లీన్ ఇండియా కోసం ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడితే.. ఆ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు ఒకరు మాత్రం అపహాస్యం చేశారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ, మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ నేత షాజియా ఇల్మీలు గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయితే, వారి వ్యవహారం వివాదాస్పదమైంది. స్వచ్ఛ భారత్‌ను నిర్మించాలంటే ముందు మురికిని తొలగించాలని, అది కనబడకుంటే చెత్త వేయాలని అనుకున్నట్లుగా ఉంది వీరి తీరు. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ముందు లోడి ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ వ్యాన్ వచ్చి చెత్త వేసిపోయింది.
ఆ తరువాత ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ ఊపాధ్యాయ్, మాజీ ఆప్ నాయకురాలు షాజియా ఇల్మి వచ్చి ఆ ప్రదేశాన్ని చీపుర్లతోశుభ్రం చేశారు. వారు రావడానికి కాసేపటి ముందు చెత్త వ్యాన్ ఒకటి వచ్చి అక్కడ చెత్తను పారవేయడాన్ని ఎవరో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో గందరగోళానికి దారి తీసింది.

ఈ విషయం పైన బీజేపీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తున్నాయి. మరోవైపు, ఈ విషయమై బీజేపీ ఢిల్లీ అధ్యక్షులు సతీష్ ఉపాధ్యాయ వివరణ ఇచ్చారు. నిర్వాహకుల తీరును ఆయన తప్పు పట్టారు.
ఇది ఇస్లామిక్ సెంటర్‌కు చెందిన కార్యక్రమమని, దాని కొద్ది నిమిషాలు అక్కడి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నానని, నిర్వాహకులు దీనికి బాధ్యత వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు కూడా దీనిని చిత్తశుద్ధితో చేయాలన్నారు.
కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో బాలీవుడ్, టాలీవుడ్, క్రీడా, పారిశ్రామిక ప్రముఖులు పాల్గొంటున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications