ఏటీఎంలతో జాగ్రత్త: కీ ప్యాడ్లపై 'హానికర బ్యాక్టీరియా',పరిశోధకుల హెచ్చరిక!
నగదు లావాదేవీల కోసం ఉపయోగిస్తున్న ఆటోమేటెడ్ టేలర్ మెషీన్ (ఏటీఎం) కీ ప్యాడ్లపై భారీ ఎత్తున బ్యాక్టీరియా పేరుకుపోయి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
న్యూయార్క్ : నోట్ల రద్దు నిర్ణయంతో యావత్తు భారతావని మొత్తం బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ లైన్లో నిలబడిన పరిస్థితి. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా.. ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో.. న్యూయార్క్ కు చెందిన పరిశోధకులు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.
నగదు లావాదేవీల కోసం ఉపయోగిస్తున్న ఆటోమేటెడ్ టేలర్ మెషీన్ (ఏటీఎం) కీ ప్యాడ్లపై భారీ ఎత్తున బ్యాక్టీరియా పేరుకుపోయి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. బ్యాక్టీరియాతో పాటు పలు రకాల సూక్ష్మజీవులు ఈ కీ ప్యాడ్లపై తిష్ట వేసి ఉండడం వల్ల.. ఏటీఎంను వినియోగించినప్పుడు సదరు ఖాతాదారుడికి వాటి వ్యాప్తి జరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

కీ ప్యాడ్లపై ఉండే సూక్ష్మజీవుల్లో.. కొన్నిరకాల పరాన్న జీవులు కుళ్లిపోయిన ఆహార బ్యాక్టీరియాను వ్యాప్తి చెందిస్తాయనేది వారి వాదన. దీనివల్ల పలురకాల వ్యాధులు ప్రబలే అవకాశముందని న్యూయార్క్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జానే కార్ల్టన్ వెల్లడించారు. కొన్ని ఏటీఎంల కీప్యాడ్లపై కుళ్లిపోయిన పాల ఉత్పత్తుల ద్వారా వెలువడే లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియా కూడా ఎక్కువగా ఉన్నట్టుగా గుర్తించామని ఆయన పేర్కొన్నారు.
అమెరికాలోని మన్ హట్టన్, క్వీన్స్, బ్రూక్లీన్ నగరాల్లోని 66 ఏటీఎం మెషీన్ల కీప్యాడ్లపై పరిశోధనలు జరిపి ఈ విషయాలను ధ్రువీకరించారు. పరిశోధనలో భాగంగా తేలిందేంటే.. ఏటీఎం క్యీ ప్యాడ్ పై ఇంట్లో ఉండే టీవీలు, కిచెన్ తో పాటు చేపలు, చికెన్ పై ఉండే పలురకాల సూక్ష్మజీవులు వీటిపై ఉన్నట్టు తేలింది. తద్వారా ఏటీఎంను ఉపయోగించినప్పుడు మనిషి శరీరంలోకి ఈ సూక్ష్మజీవులు ప్రవేశించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.












Click it and Unblock the Notifications