తమిళనాడులో ఐదుగురు మావోల అరెస్టు
హైదరాబాద్: తమిళనాడులోని థేన్ జిల్లాలోని ఒక గ్రామంలో తమిళనాడు స్పెషల్ పార్టీ పోలీసులు బుధవారంనాడు ఐదుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల షెల్టర్ జోన్ పై పోలీసులు దాడి చేశారు. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య బుధవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. మరో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారు.
గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు తమిళనాడు స్పెషల్ పార్టీ పోలీసులు పది రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు వారి షెల్టర్ జోన్ ను కనిపెట్టి పోలీసులు దాడి చేశారు. తమకు చిక్కిన ఐదుగురు మావోయిస్టుల్లో నలుగురు తమిళనాడుకు చెందినవారిగా, ఒకరు ఉత్తర భారతదేశానికి చెందినవాడని అనుమానిస్తున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. వారిని విచారిస్తే గాని పూర్తి వివరాలు తెలియవని వారంటున్నారు. వారు ఆంధ్ర మావోయిస్టులకు చెందిన కీలక క్యాడర్ అని కూడా ప్రచారం జరుగుతోంది. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన సాగర్ అలియాస్ ప్రతాప్ అలియాస్ పాండురంగారెడ్డి ఇటీవల చెన్నైలో పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications