కిడ్నాపర్లెవరో తేలాలి: దాసరి ప్రభు భార్య
హైదరాబాద్: తన భర్త చేసిన ఆరోపణలను దాసరి ప్రభు భార్య సుశీల ఖండించారు. దాసరి ప్రభును కిడ్నాప్ చేసినవారెవరో ముందు తేలాలని ఆమె ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో బుధవారంనాడు అన్నారు. తన భర్త చేత బలవంతంగా అబద్ధాలు చెప్పిస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే అలా అబద్ధాలు చెప్పిస్తున్నవారెవరో ఆమె చెప్పలేదు. ముందు కిడ్నాపర్లెవరో తేలితే అంతా తేలిపోతుందని ఆమె అన్నారు. తన భర్తను స్వేచ్ఛగా వదిలితే నిజాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. కోర్టులో ఒకటి చెప్పిన ప్రభు మర్నాడే ఇలా మాట్లడడం వెనక వేరేవారు ఉన్నారని ఆమె అన్నారు.
తాను ఎవరికి భయపడేది లేదని ఆమె చెప్పారు. ప్రభు అలా మాట్లాడినందుకు కూడా తాను బాధ పడడం లేదని ఆమె అన్నారు. తన భర్త లేకుండా తనకు ఆస్తి ఎలా వస్తుందని ఆమె అడిగారు. తనకు ఆస్తిపై ఏ విధమైన మక్కువ లేదని ఆమె చెప్పారు. మనంతట మనం బతుకుదామని తాను తన భర్తతో చెప్పినట్లు ఆమె తెలిపారు. ప్రభు చేత ఎవరు, ఎందుకు చెప్పిస్తున్నారో తేలాలని ఆమె అంటున్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, దొంగలెవరో దొరలెవరో తేలుతుందని ఆమె అన్నారు. ప్రభు చేత అలా చేయిస్తున్నవారు మనస్సాక్షితో ఆలోచించాలని ఆమె కోరారు.












Click it and Unblock the Notifications