మా ఆవిడ శోభన్ ఫ్యాన్: చిరంజీవి
చెన్నై: తమ ఇంట్లో అర డజను మంది హీరోలున్నా తమ భార్య సురేఖ శోభన్ బాబు అభిమాని అని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకున్నారు. శోభన్ బాబుకు అంతిమ వీడ్కోలు పలకడానికి చెన్నై వచ్చిన చిరంజీవి శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శోభన్ బాబుతో కలిసి తాను చేసిన రెండు సినిమాల అనుభవం మరుపురానిదని ఆయన అన్నారు. మోసగాడులో శోభన్ ప్రత్యర్థిగా, చండీప్రియ సినిమాలో శోభన్ తమ్ముడిగా నటించానని ఆయన చెప్పారు. సినీ పరిశ్రమను ఇష్టపడని వారు, దీనిలో ప్రవేశం ఆశించరానిదిగా భావించే వారు శోభన్ బాబును చూసి తమ అభిప్రాయం మార్చుకుంటారని ఆయన చెప్పారు. నిబద్ధత, క్రమశిక్షణ, మానసిక ఆరోగ్యం, ప్రవర్తనల విషయాల్లో శోభన్ బాబుకు ఎవరూ సాటి రారని ఆయన అన్నారు. శోభన్ బాబు అభిమానులు నిబద్ధత గలవారని, ముఖ్యంగా శోభన్ బాబుకు మహిళా అభిమానులు విశేషంగా ఉన్నారని ఆయన చెప్పారు.
మరణమనేది ప్రతి వ్యక్తికీ సహజమే అయినా శోభన్ బాబును మృత్యువు కబళించిందంటే నమ్మశక్యం కాకుండా ఉందని ఆయన అన్నారు. శోభన్ బాబు మృతిని జీర్ణం సుకోలేకపోతున్నానని ఆయన అన్నారు. ఇటీవల శోభన్ బాబును తన తమ్ముడు కలిశాడని, శోభన్ బాబుతో తన అనుభవాలను చెప్పాడని ఆయన అన్నారు. శోభన్ బాబు ఒక యోగిలా జీవిస్తున్నారని, ప్రశాంత జీవితం సాగిస్తున్నారని, శోభన్ బాబు మల్లెపువ్వులాగా కనిపించారని తన తమ్ముడు తనకు చెప్పినట్లు చిరంజీవి చెప్పారు. శోభన్ బాబులో ఆరాటం, ఆదుర్దా కనిపించేవి కావని ఆయన చెప్పారు. శోభన్ బాబు జీవితం ఆదర్శనీయమని ఆయన చెప్పారు. శోభన్ బాబు మృతికి ఆయన సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications