అందాల నటుడికి అంతిమ వీడ్కోలు
చెన్నై: ఆంధ్రా అందాల నటుడు శోభన్ బాబు భౌతిక కాయానికి శుక్రవారం మధ్యాహ్నం చెన్నై శివారులోని సొంత వ్యవసాయ క్షేత్రం శాంతినికేతన్ లో అంత్యక్రియలు జరిగాయి. కుమారుడు కరుణశేషు శోభన్ బాబు భౌతిక కాయం చితికి నిప్పంటించారు. జోరువానలోనే ఆయన అంత్యక్రియలు జరిగాయి. అంతకు ముందు శోభన్ బాబు ఇంటి నుంచి ఆయన అంతిమ యాత్ర ప్రారంభమైంది. గంటలపాటు చెన్నై వీధుల్లో ఆయన అంతిమ యాత్ర సాగింది.
తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ఆయన అంతిమ యాత్రలో పాల్గొని కడపటి వీడ్కోలు పలికారు. శోభన్ బాబు అంతిమ దర్శనం కోసం అభిమానులు పెద్ద యెత్తున ఆయన ఇంటికి తరలివచ్చారు. అభిమానులతో ఆయన ఇల్లు క్రిక్కిరిసిపోయింది. శుక్రవారంనాడు దాసరి నారాయణరావు, రామానాయుడు, వాణిశ్రీ, చిరంజీవి, మోహన్ బాబు వంటి సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తరఫున ఆ పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి అంత్యక్రియలకు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications