అటా సదస్సుకు ఎన్టీఆర్, చార్మి
హైదరాబాద్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) పదో మహా సమావేశం (రెండేళ్ళకోసారి) జులై 3,4,5 తేదీల్లో న్యూజెర్సీ లోని నెవార్క్ ప్రుడెన్షియల్ సెంటర్ లొ జరుగనుంది. ఆటా సంఘం 18 ఏళ్ళ చరిత్రలో ఈ ప్రాంతంలో సమావేశం పెట్టుకోవడం ఇది రెండో సారి. ఆటా సమావేశాలకు 15 వేల మంది హాజరవుతారని నిర్వాహకులు చెబుతున్నారు. దాదాపు 500 మంది కళాకారులు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా అమెరికా, వివిధ దేశాల నుంచి హాజరు కానున్నారని వారే చెబుతున్నారు.
ఈ సమావేశాలకు హాజరు కాదలచుకున్న వారు ఆన్ లైన్ లో www.ataconvention.org ను సంప్రదించవచ్చు. త్వరగా బుక్ చేసుకుంటే వసతి, భోజన సదుపాయాలు సులభంగా ఏర్పాటు చేయగలమని ఆటా అధ్యక్షులు చంద్రా రెడ్డి గవ్వా అభిప్రాయ పడ్డారు. " ఈసారి ఆటా సమావేశాల కోసం 35 కమిటీలు ఏర్పాటయ్యాయని, వీటిలో 300 మంది సేవా దృక్పధంతో పని చేస్తున్నారు. ఈ సమావేశాలకు హాజరయ్యేవారు కట్టే ప్రతి రూపాయికీ, వెచ్చించే తగిన సంతృప్తి లభిస్తుంది." అని డాక్టర్ చంద్రా రెడ్డి గవ్వా తెలిపారు.
పదో సమావేశం కాబట్టి "దశావతారం- తెలుగు తల్లికి హారం- యువతరానికి ద్వారం" అనే భావనతో సమావేశాలు జరుగనున్నాయని డాక్టర్ చంద్రా రెడ్డి చెప్పారు. ఫిలడెల్ఫియా, బోస్టన్, డెలావేర్, వాషింగ్టన్ డిసి,వర్జీనియా తదితర ప్రాంతాలకు సమీపంలో ఉన్నందువల్ల 10 వ ఆటా సమావేశాలకు ఈ వేదికను ఎంచుకున్నామని నిర్వాహకులు తెలిపారు. " ఈ సమావేశాలకు ముఖ్య అతిధిగా హాజరు కావడానికి భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం అంగీకరించారు. సమావేశాలకు విశిష్ట అతిధులుగా రావలసిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని , టీఅర్ ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావును, బిజెపి సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడిని ఆహ్వానించాం. చాలా మంది నాయకులు సమావేశాలకు వస్తున్నట్టు నిర్ధారించారు" అని డాక్టర్ రెడ్డి చెప్పారు.
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన బృందంతో ఆటా సమావేశాలకు హాజరు కానున్నారని నిర్వాహకులు తెలిపారు. మూడో తేదీన రాత్రి విందు సమయంలో మనో, గంగాధర్, విజయలక్ష్మి పాటలు పాడి అలరించనున్నారు. హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, నితిన్, రాజా, హీరోయిన్లు చార్మి, హన్సిక ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేయనున్నారని వివరించారు. హాస్యనటులు కోట శ్రీనివాసరావు, రాళ్ళపల్లి ప్రత్యేక ఆకర్షణ అని తెలిపారు.












Click it and Unblock the Notifications