న్యూడిల్లీ, జూన్ 5: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చమురు పై అమ్మకం పన్ను తగ్గించాల్సిందిగా ముఖ్యమంత్రులను ఆదేశించారు. ఈ రోజునుండి అమలవుతున్న చమురు దరల పెరుగుదల ప్రతికూల ప్రభావాన్ని కొంతైనా తగ్గించాలని ఆమె ఆవిధంగా సూచించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు దరను లీటరుకు 5రూపాయలు, డీజిల్ దర లీటరుకు 3రూపాయలు, 'ఎల్పిజి' గ్యాస్ దరను ఒక సిలిండర్ పై 50 రూపాయలు పెంచింది. కిరోసిన్ దరలో ఎలాంటి మార్పూ లేదు.పశ్చిమ బెంగాళ్ ప్రభుత్వం పెట్రోలు పై అమ్మకం పన్నును 25శాతం నుండి 20శాతానికి తగ్గించాలని, డీజిల్ పై అమ్మకం పన్నును 17శాతం నుండి 12.5శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. కేరళ ప్రభుత్వం కూడా దరలను తగ్గించే ఆలోచనలో ఉంది. వ్యాట్ అమలులో ఉన్న రాష్ట్రాల్లో కూడా చమురుపై సేల్స్ టాక్స్ తగ్గించడానికి వీలుంది. ఇదిలావుండగా, ముడి చమురుపై కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసారు. పెట్రోలు, డీజిల్ పై సుంకాన్ని 7.5శాతం నుండి 2.5శాతానికి తగ్గించారు. ఇతర పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని 10శాతం నుండి 5శాతం వరకు తగ్గించడం జరిగింది. గత నాలుగు నెలలకాలంలో చమురు దరలను పెంచడం ఇది రెండవసారి. చివరిసారిగా ఫిబ్రవరి 14 న చమురు దరలను పెంచారు.