ఇస్లామాబాద్ పేలుళ్ళు: 60కు పెరిగిన మృతులు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని మారియట్ హోటల్‌లో జరిగిన బాంబు పేలుడు ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కు పైగా చేరుకుంది. వందలాది మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. శనివారం సాయంత్రం రంజాన్ ఉపవాస దీక్షలో ఉండగా పాకిస్థాన్ రాజధాని బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లిన విషయం తెల్సిందే. ఉగ్రవాదులు అమెరికాకు చెందిన ఐదు నక్షత్ర హోటల్ 'మారియట్"ను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకున్నారు.
పేలుడు జరిగిన చోటుకు సుమారు వంద అడుగుల దూరంలో ఉన్న హోటల్ లాబీ, రిసెప్షన్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. చుట్టుపక్కల ఉన్న రెండు డజన్ల కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమైపోయాయి. మంటల్లో కాలి రూపం కోల్పోయాయి. హోటల్ సమీపంలోని ఇతర కట్టడాలు కూడా దెబ్బతిన్నాయి. పాక్ ప్రభుత్వ టీవీ చానల్ 'పీటీవీ" ప్రధాన కార్యాలయం కూడా పాక్షికంగా ధ్వంసమైంది. ఈ సంఘటనలో మరణించిన వారిలో పోలీసులు, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, హోటల్ సిబ్బంది, కొందరు విదేశీయులు ఉన్నారు.
బాధితుల్లో భారతీయులెవరూ లేరని భారత దౌత్యకార్యాలయ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. భారీ పేలుడు జరిగిన హోటల్ మారియట్‌కు అర్థ కిలోమీటరు దూరంలోనే పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ నివాసం కూడా ఉంది. పేలుడు సమయంలో అధ్యక్షుడు జర్దారీ, ఆర్మీ చీఫ్ కయానీతో సహా పలువురు అత్యున్నత ప్రముఖులు అక్కడే ఉన్నారు. ఇఫ్తార్ విందు ఆరగిస్తున్నారు. వీరంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications