చిరంజీవిది 'ప్రజా అంకిత యాత్ర'

దీర్ఘకాలంగా ఆయా ప్రాంతాల్ని పట్టిపీడిస్తున్న సమస్యలతోపాటు తాజాగా ప్రజలు ఆందోళన చేస్తున్న అంశాల్నీ ఇప్పటికే పార్టీ గుర్తించింది. అధ్యయనం చేసింది. ఆయా ప్రాంతాల్లో యాత్ర ప్రవేశించినప్పుడు ప్రజల నుంచి సమస్యలు ప్రస్తావనకు వస్తే అప్పటికప్పుడు స్పందించి పార్టీ వైఖరిని చిరంజీవి వెల్లడిస్తారు. ఒకవేళ అసాధారణ జనసందోహం, కోలాహలంతో ప్రజలు సమస్యలను ప్రస్తావించలేని పరిస్థితి ఉంటే చిరంజీవే స్వయంగా వాటిని పేర్కొని పార్టీ తరఫున మద్దతు ప్రకటిస్తారు. పరిష్కార మార్గాల్ని సూచిస్తారు.
ఇందులో అత్యంత కీలకాంశంగా పార్టీ పరిగణిస్తున్న అంశం బాక్సైటు గనుల తవ్వకం. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పరిధిలో దీని ప్రభావముంది. యాత్ర ఈ మార్గంలో వెళ్లేటప్పుడు అక్కడి గిరిజనుల ఆందోళనలో అధినేత ప్రత్యక్షంగా పాల్గొనాలని ప్రరాపా వ్యూహకర్తలు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో యాత్రా మార్గాన్ని నిర్ణయిస్తున్నారు. అవసరమైతే యాత్రను కొంతసేపు నిలిపైనా సరే.. ఆందోళనకు గట్టి మద్దతు ప్రకటించనున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో థర్మల్ విద్యుత్ ప్లాంటు, కోస్టల్ కారిడార్, జీడిపిక్కల పరిశ్రమ, కొబ్బరి గిట్టుబాటు ధర తదితర అంశాల్ని చిరు ప్రస్తావించే అవకాశముంది. విజయనగరం జిల్లా అంశాల్నీ ఇప్పటికే గుర్తించారు. వీటిపై పార్టీపరంగా ఇవ్వాల్సిన మద్దతు ఏ విధంగా ఉండాలన్న దానిపై చిరంజీవి రెండ్రోజుల నుంచి ఎవరికీ తెలియని ప్రదేశంలో మకాం వేసి సన్నిహితులు, పార్టీ వ్యూహకర్తలతో చర్చలు జరుపుతున్నారు. ఇవి దాదాపుగా కొలిక్కి వచ్చాయని సమాచారం. సిరిసిల్ల నేత కార్మికుల మరణాల మాదిరిగా ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసేంత స్థాయిలో ప్రరాపా గుర్తించిన కొన్ని సమస్యలు ఉంటాయని పార్టీ వర్గాల అంచనా.
తాజా యాత్రలో ఉపయోగించేందుకు వీలుగా ఐదు పాటల్ని ప్రరాపా రూపొందించింది. వీటిల్లో మూడింటిని గతంలోనే రికార్డు చేయించింది. తిరుపతి సభ వేదికపై రెండు పాటలను వినిపించారు. విశేషమేమిటంటే.. మిగిలిన గీతాల్లో రెండింటిని తండ్రికి కానుకగా తానే పాడతానని చిరు కుమారుడు రామ్‌చరణ్‌తేజ ముందుకొచ్చారు. మంగళవారం దేవిశ్రీప్రసాద్ సంగీతంలో ఒక పాటను రికార్డు చేశారు. బుధవారం మరొకదాన్ని రికార్డు చేసే అవకాశముంది. యువతను ఆకట్టుకునేలా వీటిని రూపొందించినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications