బాబుపై ఉండవల్లి సంచలన ఆరోపణలు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమాస్తులు కలిగి ఉన్నారంటూ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు అవినీతిపై ఆయన 1300 పేజీల లఘు పుస్తకాన్ని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విడుదల చేశారు. ఈ అక్రమాస్తులపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని తాను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసి కోరుతానని ఆయన చెప్పారు. హైదరాబాదు సమీపంలోని మదీనాగుడా ప్రాంతంలో పది ఎకరాల భూమిని చంద్రబాబు అక్రమంగా చంద్రబాబు కుటుంబ సభ్యుల చేతుల్లోకి మారిందని, ఫోర్జరీ సంతకాలున్నాయని, డాక్యుమెంట్లన్నీ ఒకే చేతిరాతతో ఉన్నాయని, భూమి అమ్మినవారి వేలిముద్రలు కూడా రిజిస్ట్రేషన్ పత్రాలపై లేవని ఆయన చెప్పారు. ఈ విషయాలన్నీ తేల్చాలంటే ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
రణబీర్ యాదవ్ కు 700 ఎకరాలుందని, అందులో 56 ఎకరాలు చేతులు మారాయని, రణబీర్ యాదవ్ భార్య రాధ, కుమారులు రాహుల్, రోహిత్, రేష్మా భూమి యజమానులని, ఈ భూమి విషయంలో భూపరిమితి చట్టం కింద కేసు కూడా నడుస్తోందని ఆయన చెప్పారు. అందులో ఐదెకరాల భూమిని చంద్రబాబు తల్లి 35 లక్షల రూపాయలకు కొన్నారని, తర్వాత ఆమె ఆ భూమిని చంద్రబాబు కుమారుడు లోకేష్ పేరు మీద గిష్ట్ డీడ్ కింద రిజిస్టర్ చేశారని, కనీసం అటెస్టేషన్ కూడా లేదని ఆయన వివరించారు. అన్ని డబ్బులు పెట్టి కొనడానికి చంద్రబాబు తల్లి వద్ద సొమ్ము ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.
మరో ఐదెకరాలు చంద్రబాబు వద్ద డైరెక్టర్ గా పనిచేస్తున్న నాగరాజు నాయుడు కొన్నారని, ఆ భూమి చంద్రబాబు భార్య భువనేశ్వరి చేతుల్లోకి మారిందని ఆయన చెప్పారు. 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం ఆయన భార్య భువనేశ్వరికి రెండు కోట్ల రూపాయల అప్పుందని ఆయన చెప్పారు. 2004 ఏప్రిల్ 25వ ఎన్నికల పోలింగ్ ముగిస్తే 29వ తేదీన నాగరాజునాయుడి నుంచి భువనేశ్వరి ఆ భూమిని కొన్నారని ఆయన చెప్పారు. ఈ వ్యవహారమంతా చంద్రబాబు ప్రమేయంతోనే జరిగిందని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications