ఒత్తిడి కోసమే కెసిఆర్ ప్రకటన: పెద్దిరెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చేందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూనుకుంటే ఆ పార్టీతో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ప్రకటించి ఉంటారని నవ తెలంగాణ పార్టీ (ఎన్టీపి) నాయకుడు ఇ. పెద్దిరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ శక్తులన్నీ ఏకమై కాంగ్రెసును ఓడించేందుకు పని చేస్తాయని, ఇందుకు అవసరమైన ప్రయత్నాలను చేస్తున్నామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్యమంత్రి డాక్ట్రర్ వైయస్ రాజశేఖర రెడ్డి అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలను, ఏకాభిప్రాయసాధనను, త్రిసభ్య కమిటీని అడ్డుగా చెబుతూ వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఒంటెత్తు పోకడను కాదని కాంగ్రెస్ ముందుకు వస్తుందా లేదా తేల్చుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ ముందుకు రాకపోతే తెలంగాణలో కాంగ్రెసును చిత్తుగా ఓడిస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర సాధన కోసం వచ్చే నెల నుంచి జైల్ భరో కార్యక్రమం చేపడతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications