టికెట్లు అమ్ముకున్నారు: శివశంకర్
న్యూఢిల్లీ: టికెట్ల విక్రయం ఆరోపణల విషయంలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి మార్గరెట్ ఆల్వాతో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. శివశంకర్ గొంతు కలిపారు. టికెట్లు అమ్ముకునే సంస్కృతి కాంగ్రెసులో అలవాటై పోయిందని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు. 2004లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసు టికెట్లు అమ్ముకున్నారని, వంద మంది దాకా తన వద్దకు వచ్చి చెప్పుకున్నారని, తమ వద్ద డబ్బులు తీసుకుని టికెట్లు ఇవ్వలేదని వాపోయారని ఆయన అన్నారు. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న శివశంకర్ ఈ ఆరోపణలతో మళ్లీ తెర మీదికి వచ్చారు.
కాంగ్రెసు పార్టీలో టికెట్లు అమ్ముకునే దిగజారుడు పరిస్థితి చోటు చేసుకుందని ఆయన అన్నారు. ప్రస్తుతం తాను కాంగ్రెసు పార్టీకి దూరంగా ఉన్నానని ఆయన చెప్పారు. తాను కాంగ్రెసుకు 2004లోనే రాజీనామా చేశానని, ఇప్పటికైనా తన రాజీనామాను కాంగ్రెస్ నాయకత్వం ఆమోదించాలని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీ విజయం తథ్యమని ఆయన అన్నారు. తాను ప్రజారాజ్యంలో చేరేదీ లేనిదీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. వారు అడిగితే సలహాలు ఇస్తానని ఆయన చెప్పారు. చిరంజీవితో సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications