కాంగ్రెస్‌కి మాగంటి బాబు గుడ్‌బై?
హైదరాబాద్: ఇటీవలే మంత్రి పదవికి రాజీనామా చేసిన దెందులూరు ఎమ్మెల్యే మాగంటి వేంకటేశ్వరరావు (బాబు) తనకు వివిధ రాజకీయ పార్టీలనుంచి ఆహ్వానాలు వస్తున్న మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. అయితే తాను సంక్రాంతి తర్వాతే రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ తనకేదో ద్రోహం చేసినట్లు తాను భావించడం లేదన్నారు. ఇంతకాలం తనను అంటిపెట్టుకుని కొనసాగుతున్న కార్యకర్తలు, అభిమానుల ఆకాంక్షల మేరకే భవిష్యత్ నిర్ణయాన్ని తీసుకుంటానన్నారు.
తనను మంత్రి పదవినుంచి తొలగించడం పట్ల కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆవేశం, ఆవేదన నెలకొన్నాయన్నారు. పార్టీ కార్యకర్తలెవరైనా ఆవేశానికి గురి కావద్దని, ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలని మాగ౦టి బాబు సూచించారు. తాను ముఖ్యమంత్రిని మరోసారి కలిసి పరిస్థితిని కూలంకుషంగా వివరిస్తానన్నారు. రెండు రోజుల క్రితం సిఎమ్‌ను కలిసే ప్రయత్నం చేశానని అయితే వై.ఎస్.కు ఢిల్లీ టూర్ ఉండడంతో అయన హడావిడిగా వెళ్ళిపోయారన్నారు.
మరోసారి ముఖ్యమంత్రిని కలిసినా పరిస్థితిలో మార్పు రాకపోతే సంక్రాంతి తర్వాత అందుకు తగినట్టుగానే నిర్ణయం తీసుకుంటానన్నారు. ఈలోగా దెందులూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తానన్నారు. తన గురించి ప్రజల్లో నేలకొన్న అభిప్రాయాలను సేకరిస్తానన్నారు.












Click it and Unblock the Notifications