సత్యంకు ఆర్ధిక సాయం ఉండదు: కేంద్రం
న్యూఢిల్లీ: ఆర్థిక అవకతవకలతో సంక్షోభంలో పడిన సత్యం కంప్యూటర్స్ సంస్ధను గట్టెక్కించడానికి కేంద్రం బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇస్తుందని వచ్చిన వార్తలను కేంద్ర పరిశ్రమల శాఖ సహాయమంత్రి అశ్విన్‌కుమార్ కొట్టిపారేశారు. దీనితో సత్యం ఉద్యోగుల జనవరి నెల జీతాలు సందేహాస్పదంగా మారాయి.
సత్యం అవకతవకలకు మద్దతునిచ్చే విధంగా ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ప్రభుత్వం ఏ సహాయమూ అందించబోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. సత్యం బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు అవసరమైన వెసులుబాట్లు మాత్రం కల్పిస్తామని చెప్పారు. మరోవైపు ఇదే అంశంపై సత్యం కొత్త డైరక్టర్ కిరణ్ కార్నిక్ ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోవడం ద్వారా చెడు సాంప్రదాయానికి బీజం వేసినట్లవుతుందనీ, పరిశ్రమలకు ఇదో అలవాటుగా మారే ప్రమాదమూ ఉందని అన్నారు.
సత్యం ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాల కోసం ప్రధానంగా పెట్టుబడి సంస్థలు, బ్యాంకులపైనే ఆధారపడననున్నట్లు కార్నిక్ తెలిపారు. సత్యం కంప్యూటర్స్ క్లయింట్లను చేజార్చుకోకుండా చూడాలన్నదే ప్రస్తుత లక్ష్యమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications