నేతలపై ఎన్నికల కోడ్ సుత్తి దెబ్బలు
హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసులు నమోదయ్యాయి. కొందరికి నోటీసులు జారీ అయ్యాయి. గుంటూరు జిల్లాల్లో తెలుగుదేశం నాయకుడు కోడెల శివప్రసాద్ మీదనే కాకుండా, కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మీద కూడా నోటీసులు జారీ అయ్యాయి. కోడెలను అరెస్టు చేసి ఆ తర్వాత జామీను మీద విడుదల చేశారు.
రాష్ట్ర రవాణా మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ఎన్నికలసంఘం నోటీసులు జారీచేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రార్థనామందిరాలకు వెళ్లి మద్దతు కోరారని, కులాలు, మతాల ప్రాతిపదికన ఓట్లు అడుగుతున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా ఎన్నికల అధికారి జయేష్ రంజన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన రిటర్నింగ్ అధికారి జైన్‌ను వివరణ కోరారు. జైన్ మంత్రికి నోటీసులు జారీ చేశారు.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన కేసులో మాజీమంత్రి కోడెల శివప్రసాదరావును పోలీసులు అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నర్సరావుపేటలో ర్యాలీని నిర్వహించినందుకు గాను ఈసీ ఆదేశాలమేరకు ఆయనపై కేసు నమోదైంది. ఈరోజు ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన బెయిలుపై విడుదలయ్యారు. ఇదిలాఉండగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావుకు, గజ్వేల్ మార్కెట్‌కమిటీ ఛైర్మన్‌కు కూడా ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది.












Click it and Unblock the Notifications