ఆసీస్ లో కొనసాగుతున్న దాడులు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురిపై దాడులు జరిగాయి. తమది ఎంతో సురక్షితమైన దేశమని చాటిచెప్పేందుకు ఇమ్మిగ్రేషన్ మంత్రి భారత్ లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం. శుక్రవారం సిడ్నీలో ఓ హోటల్ వెలుపల ఇద్దరు భారత విద్యార్థులు తీవ్రంగా గాయపడి ఉన్నారని న్యూసౌత్ వేల్స్ పోలీస్ అధికారి బ్రియాన్ వైవర్ తెలిపారు. తాము అక్కడికి చేరుకునే సమయానికి ఆ చుట్టుపక్కల ఎవరూ లేరని, గాయపడిన ఆ ఇద్దరిని ఆస్పత్రికి తరలించామని పోలీస్ అధికారిని ఉటంకిస్తూ 'హెరాల్డ్ సన్' పేర్కొంది.
అడిలైడ్ లో జరిగిన మరో సంఘటనలో చిత్తుగా తాగిన స్థానికులు నలుగురు ఓ భారత విద్యార్థిపై దాడి చేశారు. ఓ వైపు ఈ సంఘటనలు చోటుచేసుకున్నా తమది సురక్షితదేశమని చెప్పేందుకు ఇమ్మిగ్రేషన్ మంత్రి క్రిస్ ఎవాన్స్ త్వరలో భారత్ పర్యటించనున్నారు. ఉన్నత చదువుల కోసం తమ దేశానికి రావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. తమ దేశానికి తరలి వస్తామంటూ భారత విద్యార్థుల నుంచి అందుతున్న దరఖాస్తుల్లో తగ్గుదల ఏమీలేదన్నారు. క్రిస్ తన పర్యటనలో భాగంగా భారత ప్రవాస వ్యవహారాల మంత్రి వాయలార్ రవితో భేటీ అవుతారు.












Click it and Unblock the Notifications