మహారాష్ట్ర సిఎం పదవికి పోటాపోటీ

ఎన్సీపి కూడా రోటేషన్ పద్ధతిని ముందుకు తెచ్చి ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలనే ఉత్సుకతో ఉన్నట్లు ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజబల్ ప్రకటనను బట్టి తెలుస్తోంది. రోటేషన్ పద్ధతిలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని ఆయన సూచించారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, తుది నిర్ణయం తమ నేత శరద్ పవార్ తీసుకుంటారని ఆయన అన్నారు. కాగా, శరద్ పవార్ మాత్రం ముఖ్యమంత్రి పదవిపై పట్టుతో లేనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎవరనేది కాంగ్రెసు పార్టీ నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. సిఎం రేసులో లేమంటూనే ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని చూస్తోంది. ముఖ్యమంత్రి పీఠం మాత్రం తమదేనని విలాస్ రావు దేశ్ ముఖ్ అన్నారు.
కాంగ్రెసు, ఎన్సీపి కూటమి మ్యాజిక్ ఫిగర్ కు సమీపంలో ఉంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు వెలువడిన ఫలితాలను బట్టి కాంగ్రెసు, ఎన్సీపి కూటమి 141 స్థానాలు గెలుచుకుంది. మొత్తం 288 స్థానాల్లో 284 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. శివసేన - బిజెపి కూటమి మెజారిటీకి చాలా దూరంలో ఉంది. ఈ కూటమి 90 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. రాజ్ థాకరే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ కు 13 స్థానాలు వచ్చాయి. ఆర్ఎల్డిఎఫ్ కు 12 స్థానాలు వచ్చాయి. తాము ఆర్ఎల్టీఎఫ్ మద్దతు తీసుకుంటామని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. భావ సారూప్య పార్టీల మద్దతు కోరుతామని ముఖ్యమంత్రి అశోక్ చవాన్ చెప్పారు. కాంగ్రెసుకు మద్దతివ్వడానికి రాజ్ థాకరే కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటనను బట్టి తెలుస్తోంది.
కాగా, అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెసు పూర్తి మెజారిటీ సాధించింది. శాసనసభలో 60 స్థానాలుండగా కాంగ్రెసుకు 30కి పైగా స్థానాలను గెలుచుకుంది. పోలింగ్ కు ముందే ముగ్గురు కాంగ్రెసు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications