కెసిఆర్ పై కేసులు ఎత్తేస్తాం: రోశయ్య

శాసనసభలో 'హైదరాబాద్ ఫ్రీజోన్' అంశంపై తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె. రోశయ్య స్పష్టం చేశారు. మంత్రి మండలితో సమావేశం అనంతరం సచివాలయంలో సీఎం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల కోర్కె మేరకు తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని రోశయ్య తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతామని చెప్పిన సీఎం, మిగిలిన పక్షాలు కలిసి రావాలని పిలుపు ఇచ్చారు. 'ఫ్రీజోన్' అంశంపై సుప్రీం కోర్టులో ప్రభుత్వం సమర్థవంతంగా తన వాదనలు వినిపిస్తోందని, అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయం వస్తుందని పూర్తి విశ్వాసం తమకు ఉందన్నారు.
నిన్న చోటుచేసుకున్న విధ్వంసాలపై ఐటీ వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయని అయితే ఎటువంటి ఆందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని ఆ వర్గాలకు సీఎం ఈ సందర్భంగా తెలిపారు. 'సంయమనం పాటించాలని పోలీసులకు సూచించామంటే చేతులు కట్టుకొని కూర్చోమని కాదు, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే,'అని రోశయ్య స్పష్టం చేశారు. విధ్వంసాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నారు.
తన పరిధిలో ఉన్న అంశాలపై కేసీఆర్‌తో చర్చించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొంటూ, తాము పంతానికి పోవడం లేదని సీఎం అన్నారు. దీక్ష విరమించి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఏర్పడడానికి కేసీఆర్ కృషి చేయాలన్నారు. గత నెల 29 నుంచి ఇప్పటివరకు కేసీఆర్‌పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని మంత్రి మండలి సమావేశంలో నిర్ణయించామని రోశయ్య చెప్పారు.












Click it and Unblock the Notifications