దాగుడుమూతలు బంద్: వైయస్ జగన్ అవుట్, చిరంజీవి ఇన్?

రోశయ్య ప్రభుత్వాన్ని కాపాడడానికి చిరంజీవి కాంగ్రెసు అధిష్టానంతో ఇప్పటికే ఓ అంగీకారానికి వచ్చారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసే సాకుతో ఆయన మరోమారు కాంగ్రెసు అధిష్టానం పెద్దలను కలిసి ప్రభుత్వంలో పాలు పంచుకోవడానికి నిర్దిష్టమైన ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంది. చిరంజీవి మాటలు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. సోనియాపై సాక్షి మీడియా వార్తాకథనాన్ని చిరంజీవి వ్యతిరేకించారు. వ్యూస్ ను న్యూస్ గా చూపించడం సరి కాదని ఆయన వ్యాఖ్యానించారు. అలా చేసి కొంత మంది మనోభావాలను దెబ్బ తీయడం మంచిది కాదని ఆయన అన్నారు. అంతలోనే సర్దుకుని, అది కాంగ్రెసు పార్టీ అంతర్గత విషయమని, తాము ఆ పరిణామాలపై మాట్లాడడం అప్రస్తుతం, అనవసరమని ఆయన అన్నారు.
వైయస్ జగన్ సాక్షి మీడియా వార్తాకథనాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ కూడా చెప్పారు. రెండు, మూడు రోజుల్లో విషయంపై నిర్ణయం జరుగుతుందని కూడా ఆయన చెప్పారు. పూర్తి వివరాలతో, సాక్ష్యాలతో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వైయస్ జగన్ వ్యవహారంపై రెండో నివేదికను కూడా పంపినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా పార్టీ అధిష్టానం వైయస్ జగన్ వివరణను కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. దానికి వైయస్ జగన్ వ్యతిరేకంగా ప్రతిస్పందిస్తూ పార్టీని చీల్చడానికి గానీ సొంత పార్టీ పెట్టదలుచుకున్నా ప్రభుత్వానికి నష్టం జరగకుండా చిరంజీవితో మంగళవారం చర్చల్లో కాంగ్రెసు అధిష్టానం నిర్దిష్టమైన ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications