కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్: క్యాబినెట్ లో చేరికపై చిరంజీవి డైలమా

గతంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చిరంజీవి భేటీ అయినపుడు అవసరమైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామంటూ ప్రకటించారు. తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను, ఇటీవల ఎంపీ జగన్‌తో 18 మంది ఎమ్మెల్యేలు భేటీ కావడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ముందుచూపుతో వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే ప్రజారాజ్యంతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోంది. మంత్రివర్గం కూర్పు నేపథ్యంలో... ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు ప్రజారాజ్యం అంశంపై కూడా చర్చించారు. సోమవారంనాటి భేటీలో ప్రజారాజ్యం ప్రభుత్వంలో చేరిక, లేదా ఈ రెండు పార్టీల మధ్య సమన్వయం ఎలా ఉండాలన్న అంశాలు భేటీలో చోటుచేసుకుంటాయి. అవసరమైనపుడు 18 మంది ప్రజారాజ్యం ఎమ్మెల్యేల మద్దతు తీసుకునే విషయంపై కూడా మాట్లాడుకుంటారు. సమన్వయంతో ముందుకు వెళ్తూ మలివిడత విస్తరణలో ప్రభుత్వంలో చేరే అవకాశాన్ని ప్రజారాజ్యం పార్టీ కొట్టిపారేయడంలేదు. మంత్రివర్గంలో చేరితే మూడు లేదా నాలుగు మంత్రిపదవులు దక్కే అవకాశం ఉంది.
ప్రభుత్వం ముందుకు వెళుతున్న తీరుని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ప్రజారాజ్యం భావిస్తోంది. తాజాగా సీఎం నుంచి ఫోన్ వచ్చిన అనంతరం చిరంజీవి అందుబాటులో ఉన్న ఆ పార్టీ ముఖ్యనేతలు సి.రామచంద్రయ్య, కోటగిరి విద్యాధరరావు, గంటా శ్రీనివాసరావు, కన్నబాబు, బండారు సత్యానందరావు ఇతర నాయకులతో సమావేశమై చర్చించుకున్నారు. కాంగ్రెస్‌తో ఎలాంటి అనుబంధాన్ని కొనసాగించాలి అనే అంశంపై ప్రజారాజ్యం చర్చల అనంతరం ఒక స్పష్టమైన వైఖరిని తీసుకోనుంది. జగన్ వర్గం వైఖరిని అంచనా వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ తమతో వ్యవహరిస్తోందని ప్రరాపా భావిస్తున్న నేపథ్యంలో సోమవారం జరిగే భేటీ రెండు పార్టీల మధ్య ఒక స్పష్టతను తెస్తుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications