వైయస్ జగన్ సాక్షి మీడియా టార్గెట్ కాంగ్రెసు అధిష్టానం

వైయస్ వివేకానంద రెడ్డిని చేరదీసి పార్టీ అధిష్టానం వైయస్ జగన్ కుట్ర చేసిందని వ్యాఖ్యానించింది. వైయస్ వివేకానంద రెడ్డి చేత అధిష్టానమే నాటకం ఆడించిందని ఆరోపించింది. వివేకానంద రెడ్డిని చేరదీసి ముమ్మాటికీ కుటుంబంలో కలతలు రేపే కుట్ర చేసిందని, ప్రెస్ మీట్ లో వివేకా మాటతీరే తిరుగులేని నిదర్శనమని చెప్పింది. జగన్ లేఖకు సమాధానం చెప్పేందుకే వైయస్ వివేకా ప్రాధాన్యం ఇచ్చారని, అడుగడుగునా అధినేత్రిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారని, విజయమ్మకు నెలకు గానీ దొరకని సోనియా అపాయింట్‌మెంట్ వివేకాకు మాత్రం రెండు రోజుల్లోనే పిలుపు వచ్చిందని, అరగంటపైగా చర్చలు జరిపారని అంటూ దీని పరమార్థం కుట్ర గాక మరేమిటని సాక్షి ప్రశ్నించింది. వైయస్ వివేకానంద రెడ్డి అధిష్టానం చేతిలో పావుగా మారారని చెప్పడానికి సాక్షి భారీ వార్తాకథనాన్ని ప్రచురించింది.
కాగా, బుధవారం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా సాక్షి టీవీ చానెల్ గమ్మత్తుగా ప్రసారం చేసింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తూ మరో వైపు ఇడుపులపాయలో వైయస్ జగన్, వైయస్ విజయలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పిస్తున్న దృశ్యాలను మరో పక్క చూపుతూ వచ్చింది. వైయస్సార్ కు ద్రోహం చేస్తూ మంత్రి పదవులు చేపడతున్నారని అర్థం వచ్చేలా ఈ ప్రసారం సాగింది. మంత్రివర్గ ఏర్పాటుపై అన్ని మీడియా చానెళ్లలోనూ వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు దుమ్మెత్తిపోస్తూ వచ్చారు. కొండా సురేఖ, పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకర రావు వంటి నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గ కూర్పుపై నిప్పులు కక్కుతూ వచ్చారు.












Click it and Unblock the Notifications