డిప్యూటీ సిఎం పదవి: దామోదరం రాజనరసింహ వర్సెస్ గీతా రెడ్డి

ఉప ముఖ్యమంత్రి పదవికి మరో మెలిక పడినట్లు సమాచారం. ఉపముఖ్యమంత్రి పదవి తెలంగాణ ప్రాంతానికి ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కోస్తా ప్రాంతానికి ఇవ్వడం ఖాయమనే ప్రచారం మొదటినుంచి ఉంది. ఈ మేరకు పీసీసీకి బొత్స సత్యనారాయణ పేరు ఖరారయినట్లే భావించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ రెండు పదవులూ తెలంగాణ ప్రాంతానికే కేటాయించాలనే ప్రతిపాదనను తాజాగా కీలక నేతలు అధిష్ఠానం ముందుంచినట్లు సమాచారం. రాబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ నేతకు ఆ పదవి కట్టబెడితే పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని వారు పట్టుబడుతున్నట్లు తెలిసింది.
ఉప ముఖ్యమంత్రి పదవి కోసం భారీపరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆమె శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. తెలంగాణ మంత్రుల్లో అందరికంటే సీనియర్ అయిన తనకు అవకాశం కల్పించాలని విన్నవించుకున్నారు. ప్రతి విషయంలో పార్టీ లక్ష్మణరేఖకు కట్టుబడి పనిచేస్తున్న తనకు కచ్చితంగా పదవి లభిస్తుందని గీతారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎస్సీ ఎంపీలు కూడా ఈ పదవి కోసం ఆమె పేరునే ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా వాళ్లంతా అధిష్ఠానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం వీరప్ప మొయిలీని కలిసి దామోదర రాజనర్సింహకు బదులు గీతారెడ్డి పేరును పరిశీలించాలని గట్టిగా కోరినట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications