విద్యార్థుల మీది తదుపరి కేసుల ఎత్తివేతపై కూడా పరిశీలన: సబిత

విద్యార్థులపై పెట్టిన కేసుల ఎత్తివేతపై చర్చకు అనుమతించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు పట్టుట్టడంతో కార్యకలాపాలు స్తంభించి శాసనసభ 15 నిమిషాల పాటు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాత దానిపై చర్చ జరిగింది. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాల సందర్భంగా విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రాంతాలకు అతీతంగా ఇరు ప్రాంతాల విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు చిరంజీవి డిమాండ్ చేశారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ విమర్శించారు. పిహెచ్ డి విద్యార్థులపై బందిపోట్లపై పెట్టే కేసులు పెట్టారని ఆయన అన్నారు. విద్యార్థులపై ఉన్న చిన్న కేసులను ఎత్తేసి పెద్ద కేసులపై విచారణ జరపాలని లోకసత్తా సభ్యుడు జయప్రకాష్ నారాయణ అన్నారు.
సిపిఐ సభ్యుడు మల్లేష్, సిపిఎం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, బిజెపి సభ్యుడు జి. కిషన్ రెడ్డి విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ముస్లిం యువకులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని మజ్లీస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. సబితా ఇంద్రారెడ్డి సమాధానం ఇచ్చిన తర్వాత తన డిమాండ్ పై అక్బరుద్దీన్ పట్టుబట్టారు. దీంతో సభాపతి నాదెండ్ల మనోహర్ సభను మరోసారి 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications