మా నివేదిక కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు: శ్రీకృష్ణ

రాష్ట్ర ప్రభుత్వం మాకు అన్ని విధాలా సహకరించిందన్నారు. మేం అడిగిన సమాచారం మాకు అందించిందన్నారు. అన్ని పార్టీలను, వర్గాలను కలిశామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని అంశాలను స్పృశించిన తర్వాతే నివేదిక తయారు చేశామన్నారు. పదినెలల్లో రాష్ట్రంలోని అన్ని అంశాలపై సంపూర్ణ అధ్యయనం చేశామని చెప్పారు. మేం తయారు చేసిన నివేదిక రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
నివేదిక ఉద్దేశ్యాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా వివరించడం మీడియా బాధ్యత అని శ్రీకృష్ణ అన్నారు. మేం తయారు చేసిన నివేదిక కొందరికి నచ్చవచ్చు, మరికొందరికి నచ్చకపోవచ్చు అని చెప్పారు. నివేదిక కేంద్రానికి అందించిన తర్వాత ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. నివేదికలు ఇవ్వడం నాకు కొత్త కాదని, అయితే డిసెంబర్ 31 తర్వాత మీడియా సహకారం అవసరమన్నారు. రిపోర్టు ఇచ్చాక శాంతికి భంగం కలిగించకుండా అన్ని పార్టీలు ఉండాలన్నారు.
శాంతి సామరస్యాలు కాపాడటంలో మీడియా పాత్ర ఎంతో ఉంటుందన్నారు. అందరి అభిప్రాయాలు నివేదికలో పొందుపర్చామన్నారు. నివేదికలోని అంశాలు తప్ప ఏవైనా మాట్లాడుతానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నివేదిక రూపొందించటం నా జీవితంలో మరుపురాని ఘట్టమని మరో సభ్యుడు షరీఫ్ అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలనుండి సమాచారం సేకరించామని సభ్యురాలు రవీందర్ కౌర్ అన్నారు. కొద్ది నెలలు చాలా పరిశోధనలు చేశామన్నారు.












Click it and Unblock the Notifications