విద్యార్థుల బలిదానాలు గుర్తు చేసుకొని బోరున ఏడ్చిన పోచారం

తెలంగాణ ఏర్పడిన తర్వాత పాఠ్యపుస్తకాలు వస్తాయన్నారు. ఆ పుస్తకాలలో తెలంగాణ కోసం పోరాడిన వారి పేర్లు, పదవులు అట్టిపెట్టుకున్న వారి పేర్లు వస్తాయన్నారు. తెలంగాణ ప్రజలకు అండగా ఉంటారా, మోసం చేస్తారా నిర్ణయించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ సాధన కోసం తాను టిడిపికి రాజీనామా చేసినట్టు చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబడాలంటే తెలంగాణ కోసం పోరాడాల్సిందే అన్నారు. తెలంగాణ ఇస్తామని చెప్పి ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి పార్టీ మోసం చేస్తుందన్నారు. 2004లో కాంగ్రెసు, 2009లో టిడిపి తెలంగాణకు సరే అని చెప్పి ఇప్పుడు అందుకు వెనక్కి తగ్గాయన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉంటానన్న టిడిపి కట్టుకథ చెబుతుందన్నారు.
టిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ సాధన కోసమన్నారు. టిఆర్ఎస్‌పై రాళ్లు వేసే వారు ఉంటారు. కానీ వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అసమర్థ రాజు ఉండటం కన్నా రాజు లేకుండా ఉండటమే మేలు అన్న చందంగా మనం ఉద్యమించాలన్నారు. ఓటు వేసే వరకు తెలంగాణ ప్రజలను మోసం చేసి ఆ తర్వాత పార్టీలు మరిచి పోతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాని తీరుకు నిరసనగానే రాజీనామా చేసి ఉద్యమిస్తానన్నారు. కెసిఆర్ నాయకత్వంలో పని చేస్తానన్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో టిడిపి తెలంగాణ తీర్మానం చేస్తే మద్దతిస్తానని చెప్పి ఇప్పుడు మాట్లాడటం లేదన్నారు.
జెఏసి పిలుపు మేరకు మూడు నెలలుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నానన్నారు. టిడిపి తెలంగాణపై నిర్ణయం తీసుకోనందుకే తాను జనవరి 3వ పార్టీని విడుస్తున్నట్టు ప్రకటించినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనకుంటే చరిత్ర క్షమించదని ఆయన అన్నారు. తాము ఆస్తులు అడగటం లేదని, న్యాయం కావాలని అడుగుతున్నామన్నారు. నన్ను టిడిపి పార్టీ గుర్తుపై గెలిపించినా తెలంగాణ ఆకాంక్షతో ప్రజలు గెలిపించారని అందుకే రాజీనామా చేస్తున్నానన్నారు.