వైయస్ జగన్‌పై పోటీకి ఇద్దరు నేతలూ అయిష్టమే, మరి గెలుస్తారా?

మైసురా రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డితో పడకపోవడంతో కాంగ్రెసు నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఆయన 2004 ఎన్నికల్లో వైయస్ వివేకానంద రెడ్డిపై తెలుగుదేశం పార్టీ తరఫున కడప లోకసభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కడప స్థానంలో ఓడిపోతే రాజ్యసభకు పంపిస్తామనే హామీ తీసుకున్న తర్వాతనే మైసురా రెడ్డి అప్పుడు పోటీకి అంగీకరించారు. రాజ్యసభకు ఎన్నికైన తర్వాత మైసురా రెడ్డి పెద్దగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అంతగా ఇష్టపడడం లేదని అంటారు. ఈ స్థితిలో చంద్రబాబు మైసురా రెడ్డిని కడప బరిలోకి దింపారు. ఆయన ఈ నెల 18వ తేదీన కడప లోకసభ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు.
అదిలా ఉంటే, మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వైయస్ జగన్‌ను ఓడించాలనే పట్టుదలతో ఉన్నప్పటికీ తాను ఎన్నికల బరిలోకి దిగడానికి ఇష్టపడలేదు. ఆయన ప్రత్యామ్నాయాలు చూపారు. కానీ కడప జిల్లా కాంగ్రెసు నాయకులు ఆ ప్రత్యామ్నాయాలను అంగీకరించలేదు. పైగా, తెలుగుదేశం నుంచి వచ్చిన కందుల రాజమోహన్ రెడ్డిని పోటీకి దింపాలని కాంగ్రెసు నాయకత్వం ప్రయత్నించింది. ముఖ్యంగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ ప్రయత్నం చేశారు. డిఎల్ రవీంద్రా రెడ్డి, తదితర నాయకులు కూడా రాజమోహన్ రెడ్డిని ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన ఇష్టపడలేదు. దాంతో డిఎల్ రవీంద్రా రెడ్డి మెడకే గంట కట్టారు.
నిజానికి, అటు తెలుగుదేశం పార్టీ, ఇటు కాంగ్రెసు పార్టీ కందుల రాజమోహన్ రెడ్డి వైపే మొగ్గు చూపాయి. అయితే, రాజమోహన్ రెడ్డి గానీ, ఆయన సోదరుడు కందుల శివానంద రెడ్డి గానీ పోటీకి అంగీకరించలేదు. తాము పెట్టిన షరతులకు చంద్రబాబు అంగీకరించలేదనే నెపంతో కందుల సోదరులు తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెసులోకి వచ్చారు. కాంగ్రెసు వారి షరతులకు అంగీకరించినా వెనక్కి తగ్గారు. వైయస్ జగన్‌పై అభ్యర్థులను ఎంపిక చేయడంలోనే తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు తీవ్ర అయోమయానికి, గందరగోళానికి గురయ్యాయి. ఈ స్థితిలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు వైయస్ జగన్‌ను కడప లోకసభ స్థానంలో ఏ మేరకు నిలువరిస్తాయనేది వేచి చూడాల్సిందే.