H-1B Visa ఫీజు వ్యవహారంలో అనూహ్య పరిణామం
అమెరికాలో హెచ్-1బీ (H-1B) వీసాలపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన ఫీజు విషయం అనూహ్య మలుపు తిరిగింది. బోస్టన్ ఫెడరల్ కోర్టు దీన్ని రద్దు చేసి పడేసింది. ఈ నిబంధనను చట్టవిరుద్ధమని తేల్చి చెప్పింది. ఎటువంటి అనుమతులు లేకుండా H1B వీసా ఫీజులను పెంచే అధికారం అధ్యక్షుడికి లేదని, ఇది చట్టబద్ధం కాదని వ్యాఖ్యానించింది.
ఈ మేరకు యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సోరోకిన్ సోమవారం తీర్పునిచ్చారు. ఈ నిర్ణయంతో భారతీయ ఐటీ నిపుణులు, అమెరికన్ విశ్వవిద్యాలయాలు, ఆయా రంగాల్లోని కార్పొరేట్ సంస్థలకు భారీ ఊరట లభించింది. ఏకంగా 1,00,000 డాలర్ల ఫీజును వసూలు చేయాలన్న ట్రంప్ నిర్ణయంపై దాఖలైన పిటీషన్లపై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

యూఎస్ కాంగ్రెస్ ఆమోదం లేకుండానే ఈ భారీ ఫీజును విధించే అధికారం అధ్యక్షుడికి లేదని న్యాయమూర్తి సోరోకిన్ స్పష్టం చేశారు. ఈ విధానంపై కాలిఫోర్నియా సహా 19 డెమోక్రటిక్ నేతృత్వంలోని రాష్ట్రాలు కోర్టులో సవాల్ చేశాయి. తగిన చట్టపరమైన అధికారం లేకుండానే ఈ నిబంధనను తీసుకువచ్చారని ఆ రాష్ట్రాలు వాదించాయి. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇతర వ్యాపార సంస్థలు కూడా ఈ విధానంపై వేర్వేరుగా ఈ పిటీషన్లను దాఖలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వాస్తవానికి.. వివిధ రంగాలకు చెందిన విదేశీ నిపుణులు, కార్మికులు, మెడికల్ సపోర్టింగ్ స్టాఫ్ పై ఆధారపడటాన్ని తగ్గించి, స్థానిక అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ట్రంప్ గత ఏడాది ఈ ఫీజు పెంపును ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో H1-B వీసా కోసం దాదాపు 2,000 నుండి 5,000 డాలర్లు మాత్రమే ఫీజుగా చెల్లించేవి.
ఒక్కసారిగా ఈ మొత్తాన్ని లక్ష డాలర్లకు పెంచడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. డెమోక్రటిక్స్ అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పాటు అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. నిపుణులు తగ్గిపోయే ప్రమాదం ఉందని వాదించాయి. దీన్ని రద్దు చేయాలని కోరుతూ స్థానిక న్యాయస్థానాలను ఆశ్రయించాయి. పిటీషన్లు దాఖలు చేశాయి. దీనిపై తాజాగా బోస్టన్ కోర్టు తీర్పు వినిపించింది.
ఈ నిర్ణయంపై డొనాల్డ్ ట్రంప్ పైకోర్టులో అప్పీలు చేసే అవకాశం ఉంది. కాగా అమెరికాలో అత్యున్నత నైపుణ్యం కలిగిన విదేశీయులలో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. H-1B వీసా కార్యక్రమం ప్రాథమికంగా టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఫైనాన్స్, హెల్త్‌కేర్ వంటి రంగాలలో నిపుణులను రిక్రూట్ చేసుకోవడానికి కంపెనీలకు కీలకం. ప్రతి ఏటా సుమారు 65,000 సాధారణ వీసాలు, అమెరికన్ విద్యాసంస్థల నుండి ఉన్నత విద్య పూర్తి చేసిన వారికి అదనంగా 20,000 వీసాలను జారీ చేస్తారు.
ఇమ్మిగ్రేషన్ అడ్వకేసీ గ్రూప్ ఎఫ్డబ్ల్యూడీ.యూఎస్ (FWD.us) గణాంకాల ప్రకారం, ప్రస్తుతం అమెరికాలో సుమారు 7,30,000 మంది హెచ్-1బీ వీసాదారులు జీవిస్తున్నారు. వారితో పాటుగా సుమారు 5,50,000 మంది జీవిత భాగస్వాములు, పిల్లలు డిపెండెంట్లుగా అమెరికాలో ఉంటున్నారు. ఈ వీసా నియంత్రణ సడలింపు నిర్ణయం, అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయ నిపుణులు, వారి కుటుంబాలకు ఊరట కలిగినట్టయింది.












Click it and Unblock the Notifications