చంద్రబాబు లేఖ రాస్తేనే తలెత్తుకుంటాం: ముదురుతున్న నాగం లొల్లి
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా కేంద్రమంత్రి చిదంబరానికి లేఖ రాయమని విజ్ఞప్తి చేస్తూ తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి ఆదివారం ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. ప్రణబ్ కమిటీకీ తెలంగాణ విషయంలో ఎలాగైతే లేఖ రాశారో అలాగే చిదంబరం కమిటీకి లేఖ రాయాలని ఆయన కోరారు. ప్రణబ్ కమిటీ కాలం చెల్లిన కమిటీ కాబట్టి చిదంబరం కమిటీకి రాయాలని ఆయన లేఖలో కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై కూడా అనుకూల ప్రకటన చేయమని ఆయన అందులో చంద్రబాబును కోరారు.
కాగా తెలంగాణలో అందరూ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిడిపి తలెత్తుకొని మన పార్టీ కార్యకర్తలు, నేతలు తిరగాలంటే చంద్రబాబు ఖచ్చితంగా చిదంబరానికి లేఖ రాయాల్సిందే అన్నారు. చంద్రబాబుపై కూడా ఈ దిశలో నేతలు, కార్యకర్తలు ఒత్తిడి తేవాలని కోరారు. మహానాడు ఈ నెల 25న ఉన్నందున ఆ లోపు బాబు నిర్ణయం తీసుకోవాలని కోరారు. మహానాడులో చర్చ పెట్టి కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

ప్రజల్లోకి వెళతామని చెప్పారు.
తమ పార్టీ ముసాయిదాలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. టిడిపితో పాటు అన్ని పార్టీలు జెండాలు పక్కన పెట్టి తెలంగాణ అజెండాతో ముందుకు వెళ్లాలన్నారు. అందరం కలిసి ముందుకు వెళదామని చెప్పారు. తాను ఎప్పుడూ పార్టీ అధినేతను, పార్టీని విమర్శించ లేదన్నారు. కేవలం జెండాను మాత్రమే పక్కన పెట్టానని చెప్పారు. టిడిపిలో తెలంగాణ ఉద్యమం నిద్ర పోయినట్టు ఉండేదని, అయితే నాగర్ కర్నూలు తెలంగాణ నగారా కారణంగా టిడిపిలో తెలంగాణ ఉద్యమం జూలు విదిల్చిందన్నారు. ఆ సభ లేకుంటే టిడిపి ఉద్యమించేది కాదన్నారు.












Click it and Unblock the Notifications