జూ. ఎన్టీఆర్‌కు విరుగుడు: చంద్రగిరి బరిలో బాలయ్య
తిరుపతి: జూనియర్ ఎన్టీఆర్‌కు మరో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరో విరుగుడు కనిపెట్టినట్లే ఉన్నారు తన స్వస్థలమైన చంద్రగిరి నియోజకవర్గం నుంచి దివంగత ఎన్టీఆర్ తనయుడు, చంద్రబాబు వియ్యకుండు నందమూరి బాలకృష్ణను వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన కుమారుడు నారా లోకేష్‌ను, తన తమ్ముడు రామ్మూర్తినాయుడు కుమారుడు గిరీష్‌ను పక్కన పెట్టి బాలయ్యను రంగంలోకి దించాలనే ఆలోచన వెనక పెద్ద ఎత్తుగడనే ఉన్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, ఆయన తండ్రి హరికృష్ణ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి లోకేష్‌ను పక్కన పెట్టి, బాలయ్యను చంద్రగిరిని దించితే భవిష్యత్తులో లోకేష్‌కు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. నారావారిపల్లెలో చంద్రబాబు శుక్రవారం వచ్చిన సందర్భంగా పలువురు తెలుగుదేశం సీనియర్ నాయకుల నోటి నుంచి బాలయ్యను పోటీకి దించుతారనే మాట వచ్చింది. కార్యకర్తల్లో సైతం దీనిపై పెద్దఎత్తున చర్చ జరిగింది.

బాలయ్య వస్తే తమ సీటు వదులుకోవడానికి పలువురు సిద్ధపడ్డారు. అయితే అక్కడ వర్గ సమీకరణలతో పాటు, ఇప్పటికే బాగా నాటుకుపోయిన వారిని పక్కకు తప్పించడం కంటే తన సొంత నియోజకవర్గమైన చంద్రగిరి నుంచే బాలయ్యను రంగంలోకి దింపడం ఉత్తమంగా పార్టీ అధినేత ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణను చంద్రగిరి నుంచి రంగంలోకి దించడం వల్ల రాజకీయంగా చాలా మేలు జరుగుతుందని ఆ పార్టీ వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల జిల్లాలో అటు చిరంజీవి ప్రభావాన్ని, ఇటు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభావాన్ని ఎదుర్కోవడంతో పాటు రాయలసీమ జిల్లాల్లో పార్టీకి మంచి ఊపు వస్తుందని పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications