హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొత్స ఆదేశాలు బేఖాతర్!: సమన్వయం లేక విలవిల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదేశాలు పార్టీ నేతలు బేఖాతర్ చేస్తున్నట్లుగానే కనిపిస్తోంది. ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెసు నాయకులు సీనియర్లు, జూనియర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు అని తేడా లేకుండా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరికి మరొకరు సవాళ్లు విసురుతున్నారు. ఇటీవల సికింద్రాబాద్ లోకసభ స్థానం కోసం ముఖేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ మధ్య వాగ్యుద్ధం జరిగినప్పుడే బొత్స కల్పించుకొని పార్టీ నేతలు ఎవరూ ఏ అంశం పైన కూడా బహిరంగంగా విమర్శలు చేసుకోవద్దని సూచించారు. కానీ ఆయన ఆదేశాలు మాత్రం ఎవరూ ఖాతరు చేయడం లేదు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత నేతల ప్రకటనలు జోరందుకున్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారు. మీడియాకెక్కుతున్నారు. సొంత పార్టీ నేతల పైనే విపక్షాలపై విరుచుకు పడినట్లు ప్రవర్తిస్తున్నారు. ఇక తెలంగాణ నేతలు అయితే ఏకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్సను టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు. వారి పైన వీరి వర్గం విరుచుకు పడుతోంది.

దీంతో రాష్ట్ర కాంగ్రెసులో గందరగోళ పరిస్థితి నెలకొంది. పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు మాట్లాడుతూ.. కడప ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కూర్చుని చర్చించుకుంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదని చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీ వివేక్, సీనియర్ నేతలు కె కేశవ రావు, జీవన్ రెడ్డిలు ముఖ్యమంత్రి వైఖరిని తప్పు పట్టారు. దీంతో సిఎం అనుకూల వర్గం, మంత్రులు కిరణ్‌ను టార్గెట్ చేసుకున్న వారిపై విరుచుకు పడ్డారు. మంత్రి డికె అరుణ, శైలజానాథ్, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మా రెడ్డి తదితరులు సీనియర్లపై నిప్పులు గక్కారు. ఎన్నికలకు ముందే కొందరు నేతలు పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవని, పార్టీ ఓటమి పాలవుతుందని పలుమార్లు బహిర్గతంగా చెప్పినా బొత్స అంటువంటి నాయకులను కట్టడి చేయలేక పోయారని అంటున్నారు.

గత సంవత్సరం తెలంగాణ ఉద్యమం సమయంలోనూ నేతలు ప్రాంతాల వారిగా విడిపోయి విమర్శలు గుప్పించుకున్నారు. రాష్ట్ర కాంగ్రెసు నేతల మధ్య సమన్వయం లోపించిందని, నాయకులు ప్రాంతాల వారిగా విడిపోవడం వల్లనే పార్టీ ఇలా బజారుపాలయిందని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పార్టీ నేతల మధ్య సమన్వయం చేయటంలో బొత్స విఫలమవుతున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. పార్టీని, ముఖ్యమంత్రిని విమర్శించిన వారిపై మిగిలిన నేతలు ఎదురు దాడి చేయకుండా కూడా బొత్స కట్టడి చేయడం లేదని అంటున్నారు.

English summary
It seems, Congress leaders are neglecting PCC chief Botsa Satyanarayana orders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X