తిరుపతి సీటుపై సూచనలు ఇవ్వడం లేదు: చిరంజీవి

తాను ఉప ఎన్నికల ప్రచారంలో తప్పకుండా పాల్గొంటానని ఆయన చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటన కోసం వెళ్తూ విశాఖపట్నం వచ్చిన ఆయన శనివారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉందని, అయితే ఉప ఎన్నికల షెడ్యూల్ ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదని ఆయన అన్నారు. పార్టీ షెడ్యూల్ ఖారారైన వెంటనే తాను ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తానని ఆయన అన్నారు.
ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకునే విుధంగా వ్యూహరచన చేసి, ప్రచారాన్ని నిర్వహిస్తామని ఆయన చెప్పారు. రాజ్యసభలో జరిగిన చర్చల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని, రాజ్యసభలో ప్రయోజనకరమైన చర్చ జరిగిందని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో ఇప్పటికే తాత్సారం జరిగిందని ఆయన చెప్పారు.
రాజ్యసభకు ఎన్నిక కావడంతో చిరంజీవి తిరుపతి శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సీటుకు కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా చిరంజీవి సూచించినవారినే ఎంపిక చేస్తారనే ప్రచారం సాగింది. అయితే తన కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయరని, తాను తిరుపతి సీటుకు అభ్యర్థిని సూచించబోనని గతంలోనే ఆయన చెప్పారు. దీంతో తిరుపతి నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెసు టికెట్ కోసం తన కుమారుడు గల్లా జయదేవ్ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని గల్లా అరుణ కుమారి ప్రకటిస్తూ వస్తున్నారు. ఆమె ప్రయత్నాలు కూడా ముమ్మరంగానే సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications