కూతురింట్లో డబ్బు: చిరుకు లింక్ అన్న జగన్‌పార్టీ నేత

కాంగ్రెసు పార్టీ తిరుపతిలో గెలవకపోతే తనకు కేంద్రమంత్రి పదవి రాదనే అభిప్రాయం చిరంజీవికి ఉందని జనక్ ప్రసాద్ అన్నారు. దొరికిన నగదును కేవలం ఆదాయ పన్ను లెక్కల పరిధి కింద లెక్కించకూడదని, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చిరంజీవి, ఆయన వియ్యంకుడు, కుటుంబ సభ్యులను విచారించాలని జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు.
కాగా అంతకుముందు కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నివాసంలో 35 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయం పన్ను (ఐటి) శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. చెన్నైలోని సుస్మిత నివాసంలో శనివారం తాము నిర్వహించిన సోదాలపై ఐటి శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. చిరంజీవి కూతురు నివాసంలో 4.66 కోట్ల విలువైన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
దస్తావేజులకు, నగదుకు సంబంధించి సరైన సమాధానం రాలేదని ప్రకటించిన ఐటి శాఖ మరిన్ని దాడులు నిర్వహిస్తామని తెలిపింది. ఆదాయానికి సంబంధించి సరైన వివరాలు అందించలేదనే ఆరోపణలతో ఐటి అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఐటి శాఖ అధికారులు తొలుత చిరంజీవి వియ్యంకుడికి వియ్యంకుడి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత చిరంజీవి వియ్యంకుడి నివాసంలో సోదాలు నిర్వహించారు.
చిరంజీవి కూతురు సుస్మిత ఇంట్లో సోదాలపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిచ్చు పుట్టింది. సుస్మిత నివాసంలో లభించిన సొమ్ము చిరంజీవికి సంబంధించిందని, దాన్ని ఉప ఎన్నికల్లో ఖర్చుకు నిర్దేశించారని అనుమానాలు వ్యక్తం చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి టీవీ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఐటి శాఖ దాడుల నుంచి బయటపడడానికి చిరంజీవి నేరుగా చెన్నై నుంచి ఢిల్లీ వెళ్లారని సాక్షి టీవీ వ్యాఖ్యానించింది.
సాక్షి టీవీ వార్తాకథనంపై అదే రోజు చిరంజీవి భగ్గుమన్నారు. తన వ్యక్తిత్వహననానికి సాక్షి టీవీ తప్పుడు వార్తాకథనాన్ని ప్రసారం చేసిందని ఆయన ఆరోపించారు. వైయస్ జగన్‌పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై చానెల్ అసత్య ప్రచారం సాగిస్తోందని, ప్రజలకు అపోహలు కలిగిస్తోందని, ఆ వార్తాకథనానికి టీవీ చానెల్ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. తిరుపతిలో ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత తాను చెన్నై వెళ్లానని, ఈ ఉదయమే తాను హైదరాబాదుకు వచ్చానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications