జగన్ విచారణ: లంచ్ సమయంలో కలిసిన భార్య భారతి

భారతితో పాటు జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి కూడా జగన్‌ను కలిసేందుకు వచ్చారు. కాగా అంతకుముందు భారతి చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. తన భర్తను కలిసేందుకు అనుమతివ్వాలని కోరారు. దాదాపు రెండు గంటల పాటు ఆమె అక్కడ ఉన్నట్లుగా తెలుస్తోంది. అనంతరం ఆమె జైళ్ల శాఖ డిజి కార్యాలయానికి వచ్చారు. లాయర్ల సమక్షంలో సిబిఐ అధికారులు జగన్‌ను విచారిస్తున్నారు. దీంతో తొలుత ఆమెకు అధికారులు అనుమతి నిరాకరించారు. ఆ తర్వాత లంచ్ సమయంలో కలిసేందుకు అనుమతించారు.
కాగా ఉదయం పదిన్నర గంటలకు జగన్‌ను తమ కస్టడీకి తీసుకున్న సిబిఐ అధికారులు లాయర్ల సమక్షంలో ఆయనను ప్రశ్నిస్తున్నారు. జగన్‌ను ప్రశ్నించేందుకు సిబిఐ పెద్ద ప్రశ్నావళి తయారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సాయంత్రం ఐదు గంటల వరకు వారు జగన్‌ను ప్రశ్నిస్తారు. అనంతరం జైలుకు తీసుకు వెళతారు. ఐదు రోజుల పాటు ఉదయం పదిన్నర నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అతనిని విచారిస్తారు.
మరోవైపు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కుటుంబ సభ్యులు అతనిని చంచల్‌గూడ జైలులో కలిశారు. వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో గత నెల మోపిదేవి అరెస్టయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మే 27వ తేది వైయస్ జగన్‌ను సిబిఐ అరెస్టు చేసింది. 28న నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరు పర్చారు. అతనిని తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోర్టుకు వెళ్లింది. దీంతో హైకోర్టు ఐదు రోజుల కస్టడీకి అప్పగించింది.












Click it and Unblock the Notifications