భయపడను, జగన్‌కు శిక్ష పడాలని కోరుకోలేదు: కిరణ్

వైయస్ జగన్ అరెస్టు అయింది ప్రజల కోసం కాదని, ఆర్థిక నేరాల పైన అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఇరవై ఐదేళ్లు నిరీక్షించారన్నారు. వైయస్ ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారని మండిపడ్డారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆశీస్సులతో వైయస్ రెండుసార్లు ముఖ్యమంత్రిగా అయ్యారన్నారు. తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం కాంగ్రెసు పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని చెప్పారు.
వైయస్ జగన్ చేసిన నేరాల జాబితా చిన్నదేమీ కాదన్నారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బంగారు సింహాసనం చేయించుకున్నారని అన్నారు. అలాంటి గాలితో, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య కేసులో నేరస్తులతో జగన్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. తానెవరికీ భయపడనని చెప్పారు. వైయస్ బతికుంటే కాంగ్రెసులోనే ఉండేవారన్నారు. ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం శోభా నాగి రెడ్డి తనను ఒక్క రూపాయి అడగలేదన్నారు.
అభివృద్ధి జరగాలంటే కాంగ్రెసు పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. జగన్ జైలుకు ఎందుకు వెళ్లాడో ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రజల తరఫున పోరాటాలు చేసి ఆయన జైలుకు వెళ్లలేదన్నారు. అభివృద్ధికి తనది బాధ్యత అని, కసాయి వాళ్లకు మాత్రం ఓటేయవద్దన్నారు. జగన్ అరెస్టుతో ప్రభుత్వానికి, కాంగ్రెసుకు ఎలాంటి సంబందం లేదన్నారు. శోభా నాగి రెడ్డి రాజీనామా ఎందుకు చేశారని ప్రశ్నించారు. వైయస్ మరణాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెసుకు కక్ష సాధింపు ఉంటే జగన్ ఎప్పుడో అరెస్టు అయ్యేవాడని కాంగ్రెసు నేత తులసి రెడ్డి వేరుగా అన్నారు. ఐదు నెలల ముందే జగన్‌ను సిబిఐ అరెస్టు చేసి ఉంటే ఈ ఉప ఎన్నికలు వచ్చి ఉండేవి కావన్నారు. పరిటాల రవీంద్ర హత్య కేసులో జగన్ పైన సిబిఐ విచారణకు వైయస్ ఆదేశిస్తే అప్పుడెందుకు తప్పు పట్టలేదని ప్రశ్నించారు.
కల్లబొల్లి మాటలతో వైయస్ విజయమ్మ మభ్యపెట్టవద్దని కోరారు. సిబిఐకి కక్ష సాధింపు ఉంటే ఎమ్మార్ కేసులో అంబటి రాంబాబు అరెస్టు అయ్యే వారన్నారు. జగన్ అండ్ కో అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులో అన్నారు. దొంగల ముఠా నేత వైయస్ జగన్ అని, మేకపాటి బ్రదర్స్ ముఠా సభ్యులని ఆయన ఆరోపించారు. జగన్ సిక్కింలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి రూ.10వేల కోట్లు నష్టం కలిగించారని మంత్రి ఆనం పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications