జగన్ పాపమదే: విజయమ్మ, ఏం జరిగినా... షర్మిల

పరిశ్రమల కోసం వైయస్ భూములు ఇస్తే తప్పు అని సిబిఐ విచారిస్తోందని, అదే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదు నడిబొడ్డున భూములు కేటాయించినా విచారణ జరగడం లేదన్నారు. జగన్‌ను ఆస్తుల కేసులో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జగన్ ఏ తప్పు చేయలేదని, అక్రమంగా కేసులు పెట్టారన్నారు. జగన్ వద్ద లక్షల కోట్లు ఎక్కడ ఉన్నాయని ఆమె అన్నారు. జగన్ ఓదార్పు యాత్రకు కట్టుబడటమే ఇన్ని సమస్యలకు కారణమయిందన్నారు. వైయస్ హయాంలోని 26 జివోలు తప్పని చెబుతున్నారని, వాటిపై ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు.
26 జివోలను వైయస్ ఒక్కరే జారీ చేయలేదని, మంత్రివర్గం నిర్ణయంతోనే వాటిని జారీ చేశారన్నారు. బోఫోర్స్ కుంభకోణం బయటకు వచ్చినప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంట్లో సోదాలు నిర్వహించారా అని ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో ఆరోపణలు వచ్చినప్పుడు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఇంట్లో కూడా దాడులు జరగలేదన్నారు. జగన్ ఆస్తుల పైన 24 గంటల్లో విచారణ ప్రారంభించిన సిబిఐ, చంద్రబాబు నాయుడు ఆస్తుల కేసులో నెల రోజులైనా ప్రారంభించలేదని ఆరోపించారు. కాంగ్రెసు అధిష్టానానికి విధేయులుగా ఉంటే ఎవరినైనా వదిలేస్తారన్నారు.
వైయస్ హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయని, అయితే తాను ప్రత్యేకంగా ఎవరినీ నిందించడం లేదని, తన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. కాక్ పిట్ రికార్డులు సగం వరకే ఎలా రికార్డయ్యాయని అన్నారు. ఒక్క జగన్ పైన వంద శక్తులు కుట్ర పన్నుతున్నాయని విమర్సించారు. జగన్‌కు అధికార దాహమే ఉంటే 150 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా సంతకాలు చేసినప్పుడే ముఖ్యమంత్రి అయ్యే వారని, రోశయ్య పేరును జగనే ప్రతిపాదించారని గుర్తు చేశారు.
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను జగన్ బెదిరించారని ఆరోపిస్తున్నారని, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ కోసం కోట్లు ఇచ్చిన కేసులో కూడా జగన్ పైనే నిందలు వేస్తున్నారని లోకంలో ఏం జరిగినా జగనే అంటున్నారని విమర్శించారు. ఎందుకు తన బిడ్డను అరెస్టు చేశారని తాను అదే రోజు అడిగానని, కానీ సమాధానం చెప్పలేక పోయారన్నారు. జగన్ పైన చేస్తున్న కుట్రకు చాలా బాధ వేస్తోందన్నారు.
వైయస్ పేరు ఎందుకు రూపుమాపాలనుకుంటున్నారని ఆమె కాంగ్రెసు పార్టీని నిలదీశారు. వైయస్ కుటుంబంపై కక్ష ఎందుకు తీర్చుకుంటున్నారని ఘాటుగా ప్రశ్నించారు. వారి వద్ద దొరకని న్యాయం ప్రజల వద్ద దొరుకుతుందనే మీ ముందుకు వచ్చామని చెప్పారు. ఎన్నికలలో కుట్ర చేస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. జగన్ అధికారంలోకి వస్తే ఏం చేస్తారని విపక్ష నేతలు అడుగుతున్నారని, పార్టీ జెండాలోనే జగన్ ఏం చేస్తారో చెప్పారన్నారు.
అంతకుముందు షర్మిల మాట్లాడుతూ.. వైయస్ ఇచ్చిన అధికారాన్ని అనుభవిస్తూ ఆయన కుటుంబాన్నే కాంగ్రెసు పార్టీ ఇబ్బందులకు గురి చేస్తోందని నిప్పులు చెరిగారు. మీరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేస్తే రాజన్న రాజ్యానికి నాంది అన్నారు. మీరు వేసే ఓటు జగన్ నిర్దోషి అని అర్థమవుతోందన్నారు.
మీ ఓటు ద్వారా జగన్ పైన కుట్ర చేస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. విచారణ పేరుతో జగన్‌ను జైల్లో పెట్టాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. అక్రమ కేసుల్లో ఇరికించి జైల్లో ఉంచాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదని, దేశవ్యాప్తంగా అందరూ ఇటువైపే చూస్తున్నారన్నారు. ఎక్కడ ఏం జరిగినా జగన్ పైనే విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications